ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు..తన బలం పెంచుకోవడంతో పాటు బిఆర్‌ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఊహించని వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఎప్పుడైతే బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చారో..అప్పటినుంచి బిఆర్‌ఎస్ కు చెక్ పెట్టడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. అదే సమయంలో తన సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఖమ్మంలో తన అనుచరులని పెంచుకుంటున్నారు. బిఆర్‌ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్నవారిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అందరినీ ఏకం చేసి..పొంగులేటి కొత్తగా పార్టీ పెడతారా? లేదా బిజేపి లేదా కాంగ్రెస్ లో చేరతారా? అనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికి ఆయనతో బిజేపి, కాంగ్రెస్ నేతలు భేటీ అవుతున్నారు. తమ తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. కానీ పొంగులేటి ఎటువైపుకు వెళ్ళడం లేదు. ముందు ఆయన తన సొంత బలం పెంచుకునే పనిలో ఉన్నారు. అదే సమయంలో ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ని నిలువరించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 14న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో భారీ సభకు ప్లాన్ చేశారు. ఈ సభ ద్వారా బిఆర్‌ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలని ఏకతాటి పైకి తీసుకొచ్చి..బిఆర్‌ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. అయితే ఖమ్మంలో పొంగులేటి సభ పెట్టడం వెనుక పలు వ్యూహాలు ఉన్నాయి. మొదట 14న సభ పెడుతున్నారు. అంటే కర్ణాటక ఎన్నికల ఫలితం మే 13న వస్తుంది. అంటే అప్పుడు అక్కడ గెలిచే పార్టీ బట్టి..14న పొంగిలేటి పోలిటికల్ డెసిషన్ ఉండే ఛాన్స్ ఉంది.
అదే సమయంలో ఖమ్మం అసెంబ్లీలో పోటీకి పొంగులేటి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. 10 స్థానాలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మాత్రమే జనరల్ సీట్లు..మిగిలినవి రిజర్వడ్ స్థానాలు. అయితే పాలేరులో షర్మిల పోటీ చేస్తానని అన్నారు. వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో పొంగులేటి పాలేరులో పోటీ చేసే ఛాన్స్ లేదు. ఇక కొత్తగూడెం, ఖమ్మం..అయితే ప్రత్యేకంగా ఖమ్మంలోనే సభ పెడుతున్నారంటే..ఈ సీటుపి పొంగులేటి కన్నేసి ఉండవచ్చు. మొత్తానికైతే పొంగులేటి..కారులో సెగలు పుట్టిస్తున్నారు.