గత కొన్ని రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశం క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో తేలిపోయింది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. కాకపోతే ఎప్పుడు చేరతారు? ఎక్కడ చేరతారు? అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ..ఇటు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి ఖమ్మంలో భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నిర్మల్ నేత శ్రీహరి రావు సైతం త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైంది.
ఇక పొంగులేటి అంశమే తేలాలి. ఆయన కాంగ్రెస్ లోకి రావడం ఖాయమే. కాకపోతే ఖమ్మం సభలో చేరతారా? లేదా అమెరికా నుంచి రాహుల్ గాంధీ వచ్చాక ఆయన సమక్షంలో చేరతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదే క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి-పొంగులేటి భేటీ జరుగుతుందని తెలిసింది. పొంగులేటి ఎప్పుడు వస్తారు..ఆయనతో పాటు ఎంతమంది వస్తారు. ఎన్ని సీట్లు అడుగుతున్నారనే చర్చ సాగుతుంది.
పొంగులేటితో పాటు కీలక నేతలు 10 మంది వరకు కాంగ్రెస్ లోకి వస్తారని సమాచారం. ఇక వారికి ఇచ్చే సీట్లపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయిందని, పొంగులేటి చేరిక ఖాయమే అని, ఎలాంటి కండిషన్ లేకుండా పార్టీలో చేరుతున్నారని అన్నారు. అన్ని సీట్లు పొంగులేటి వర్గానికి అనేది అవాస్తవమని, అలా ఇస్తే ముందు నుంచి కష్టపడ్డ తమ నేతలు ఏం కావాలి? అని ప్రశ్నించారు. వాళ్ళు వచ్చిన తరువాత పనీతిరును బట్టే టికెట్లు ఇస్తారని, ఇదంతా కేసి వేణుగోపాల్ చూసుకుంటారని అన్నారు. చూడాలి మరి పొంగులేటి వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయో.