తెలంగాణ రాజకీయాలు కొద్ది రోజులుగా మూడు ప్రధాన పార్టీల మధ్య దోబూచులాడుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌తో పాటు తెలంగాణలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి పాగా వేయాలని చూస్తోన్న బీజేపీతో పాటు అక్కడ గత వైభవం కోసం పాకులాడుతోన్న కాంగ్రెస్… ఈ మూడు పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది.
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్‌లో కాంగ్రెస్ రోజు రోజుకు వెనకపడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరికి వారు తలోదిక్కుగా మారిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం కూడా సన్నగిల్లుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడు సీట్లు గెలుచుకోవడంతో కాస్త జోష్ వచ్చింది.
చాలా మంది ఆ పార్టీ అభిమానులు రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే కాంగ్రెస్‌కు పునరుజ్జీవనం వస్తుందని చెపుతున్నారు. అయితే రేవంత్‌కు పగ్గాలు ఇచ్చేందుకు కాంగ్రెస్లోని సీనియర్లకే ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. ఇక తాజాగా రేవంత్ ఫ్యామిలీతో సహా సోనియాను కలిశారు. తెలంగాణ వాస్తవ పరిస్థితి రేవంత్ సోనియా కళ్లకు కట్టినట్టు చెప్పారని.. కాంగ్రెస్‌ను ఇలాగే వదిలేస్తే బీజేపీ దూసుకుపోతోందని ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తనకు అప్పగిస్తే తాను పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని రేవంత్ సోనియాతో చెప్పినట్టు టాక్.
ఇక తనకు పీసీసీ పగ్గాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లకు ముందు నుంచే పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల్లోకి వెళతానని… తెలంగాణ వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక రేవంత్ టార్గెట్ కేవలం పీసీసీ పీఠం మాత్రమే కాదని… తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌ను ఓడించి సీఎం పీఠం ఎక్కడమే టార్గెట్‌గా ఉందని కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి రేవంత్ కోరిక తీరుతుందా ? ముందుగా పీసీసీ పీఠం దక్కుతుందా ? అన్నది చూడాలి.