రూటు మార్చిన సీఎం కేసీఆర్.. తొలిసారి ఆ నినాదం..

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో తనదైన వ్యూహాలు రచించుకుని, ఎత్తుగడలు వేసి రాష్ట్రసాధనకు ఉద్యమం నడిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సిద్దించాక రాజకీయ పార్టీగా ఎన్నికల బరిలో దిగి సీఎం అయ్యారు. అయితే, ఉద్యమ కాలంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ కేసీఆర్ నోట ఎప్పుడూ వినబడే నినాదం ‘జై తెలంగాణ’. తెలంగాణ కోసం ప్రతీ ఒక్కరు ఉద్యమించాలనే భావనను ఈ నినాదం తెలిపింది.

ప్రతీ రాజకీయ పార్టీ కూడా ‘జై తెలంగాణ’ అనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, తాజాగా సీఎం కేసీఆర్ తన నినాదం మార్చారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో జరిగిన ‘దళిత బంధు’ స్కీమ్ ఆవిష్కరణ సభలో ‘జై భీమ్’ అని నినదించారు. అది విన్న పింక్ పార్టీ శ్రేణులు, నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఈ నినాదం ఎత్తుకున్న నేపథ్యాన్ని బట్టి సీఎం కేసీఆర్‌లో మార్పు వచ్చిందని భావించొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా మార్పులు సంభవిస్తున్న క్రమంలో బహుజనులను తన వైపునకు మరల్చుకునేందుకుగాను కేసీఆర్ ‘జై భీమ్’ నినాదం ఎత్తుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

ఇక ఇటీవల కాలంలో ‘బడుగులకు రాజ్యాధికార సంకల్ప సభ’ పేరిట సభ నిర్వహించి ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. దాంతో బహుజునులు ఆయన వెంట ర్యాలీకాక మునుపే గులాబీ జెండా బాటలోనే ఉండేందుకుగాను సీఎం కేసీఆర్ ‘జై భీమ్’ అని నినదించినట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే, ఏది ఏమైనప్పటికీ సీఎం కేసీఆర్ దళితుల కోసం చేసే కృషి మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని మేధావులు కోరుతున్నారు.