ఏపీ : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్‌ !

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్‌ కావాలంటే డిపార్ట్‌ మెంట్‌ ఎగ్జామ్‌ తప్పనిసరిగా పాస్‌ కావాల్సిందేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రొబేషన్‌ నుంచి పర్మినెంట్‌ అయ్యేందుకు నిబంధనల మేరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆ పరీక్షలో పాస్‌ కాకపోతే.. ప్రొబేషన్‌ పొడగిస్తారని… పాసైన వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్‌్‌ చేస్తారని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ ఎవరినీ తొలగించటం జరగదని స్పష్టం చేశారు.

ప్రొబేషన్ తర్వాత డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించటం సాధారణ ప్రక్రియలో భాగమేనని తెలిపారు. కొంతమంది ప్రజల్లో కావాలనే అనుమానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల అంశంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. టీడీపీ హయాంలో జరిగిన అరాచక, మాఫియా పాలనను ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నం చేయటం ఒక్కటే బీజేపీకి తెలిసిన విషయమన్నారు. కేంద్రం నుంచి రావలసిన నిధులు తొందరగా వచ్చేటట్లు జీవీఎల్ ప్రయత్నిస్తే ప్రజలు సంతోషిస్తారని..ఊరికే పనికిరాని విమర్శలు చేస్తే బీజేపీని ప్రజలే నిలదీస్తారని హెచ్చరించారు.