ఒకే మీటింగ్ లో మంత్రులు గంగుల‌, ఈట‌ల‌.. విభేదాలు తొల‌గిన‌ట్టేనా!

-

ఇద్ద‌రిదీ ఒకే ఉమ్మ‌డి జిల్లా. ఇద్ద‌రూ బీసీ సామాజి వ‌ర్గ‌మే. మ‌రీ ముఖ్యంగా ఇద్ద‌రూ టీఆర్ ఎస్ గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కులే. రాష్ట్ర వ్యాప్తంగా ఇద్ద‌రికీ మంచి పేరుంది. ఒక‌రేమో ఉద్య‌మం నుంచి ఉన్న నేత కాగా.. మ‌రొక‌రేమో ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ ఎస్ లోకి వ‌చ్చిన వ్య‌క్తి. వారెవ‌రా అని ఆలోచిస్తున్నారా వారేనండి క‌రీంన‌గ‌ర్ మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌. వీరిద్ద‌రి గురించి ఇప్పుడు ఎందుకంటే.. గ‌త కొద్ది కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మీటింగ్ పెట్ట‌లేదు.


మామూలుగా అయితే ఒకే జిల్లా కాబ‌ట్టి ఆ జిల్లాలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఇద్ద‌రూ ఉండాల్సిందే. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. ఒక‌రి మంత్రిత్వ శాఖ‌లో ఒక‌రు జోక్యం కూడా చేసుకోలేదు. బీసీ సంక్షేమ శాఖ‌లో ఏం జ‌రిగినా త‌న‌కు సంబంధం లేద‌న్న‌ట్టే ఉన్నారు ఈట‌ల‌. అలాగే క‌రీంన‌గ‌ర్ లో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు క‌లిసి ఒక్క మీటింగ్ కూడా పెట్ట‌లేదు. దీనికి కార‌ణాలు కూడా అనేకం. 2018లో క‌రీంన‌గ‌ర్ నుంచి ముగ్గురికే మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ భావించిన‌ప్పుడు.. రెండోసారి ఈట‌ల‌కు ఇవ్వ‌కుండా త‌న‌కు ఇవ్వాల‌ని గంగుల పట్టుబ‌ట్టారు. బీసీ సామాజిక వ‌ర్గం నుంచి త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ చుట్టూ రాజ‌కీయాలు న‌డిపారు. ఇది అప్పట్లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఈట‌ల‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌దేమో అని అంతా అనుకున్నారు. కానీ ఉద్య‌మ నేత‌గా కేసీఆర్ వెన్నంటే ఉన్నాడు కాబ‌ట్టి మళ్లీ మంత్రి అయ్యారు ఈట‌ల‌.
అయితే అప్ప‌టి నుంచి ఈట‌ల మంత్రి గంగుల‌పై అసంతృప్తిగానే ఉన్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి భిక్ష కాద‌ని.. తాను గులాబీ పార్టీ ఓన‌ర్ అని… కిరాయి దారులు ఎన్ని రోజులు ఉంటారో వారే తేల్చుకోవాల‌ని గంగుల‌కు ప‌రోక్షంగా స‌వాల్ విసిరారు. ఈ మాట‌లు అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఇక ఈ మ‌ధ్య ఎన్నో మీటింగుల్లో ఈట‌ల మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. రాజ‌కీయాలు పైస‌ల ప‌రం అయ్యాయ‌ని, అణ‌గదొక్కే చోట ఉద్య‌మం ఊపిరి పోసుకుంటుంద‌ని.. ఇలా ఈట‌ల మాట్లాడుతున్న అనేక‌ మాట‌లు గంగుల‌ను ఉద్దేశించే అని టీఆర్ ఎస్ నేత‌లు భావించారు. అయితే మొన్న అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కేటీఆర్ ఈట‌ల‌ను కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి న‌చ్చ‌జెప్పార‌ని తెలుస్తోంది.
ఈ క్ర‌మంలోనే మొన్న క‌రీంన‌గ‌ర్ లో గంగుల‌, ఈట‌ల క‌లిసి క‌రోనాపై మీటింగ్ పెట్టారు. ఇది చూసిన వారి అనుచ‌రులు ఇద్ద‌రు క‌లిసిపోయారని భావిస్తున్నారు. చూడాలి మ‌రి ఇది ఎన్ని రోజులో.

Read more RELATED
Recommended to you

Latest news