ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఇప్పుడు బిఆర్‌ఎస్ కంచుకోటగా ఉన్న స్థానం మంచిర్యాల. గతంలో కాంగ్రెస్ ఇక్కడ దాదాపు 7 సార్లు గెలిచింది. అయితే మధ్యలో టిడిపి 2 సార్లు గెలిచింది. ఇక 2009 నుంచి మంచిర్యాలలో బిఆర్‌ఎస్ హవా నడుస్తుంది. 2010 ఉపఎన్నికలో కూడా బిఆర్‌ఎస్ గెలిచింది. 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సత్తా చాటింది.
1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దివాకర్ రావు నడిపల్లి, 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్ రావుకు ఇప్పుడు అనుకున్న మేర పాజిటివ్ లేదు. ప్రజా వ్యతిరేకత గట్టిగానే ఉంది. దీంతో ఈయనకు సీటు ఇచ్చే విషయంలో కేసిఆర్ ఆలోచనలో పడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని బిఆర్‌ఎస్ లోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈయనకు జిల్లాలో మంచి బలం ఉంది.
ఇక వరుస ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడంతో..ఇప్పుడు ఆయనపై సానుభూతి ఉంది. మంచిర్యాలలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. పైగా ఈయనకు సిర్పూర్ పై కూడా పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నుంచి సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
రానున్న ఎన్నికల్లో మంచిర్యాల బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఈయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈయనని బిఆర్‌ఎస్ పార్టీలోకి తీసుకోవాలని కేసిఆర్ స్కెచ్ వేస్తున్నారు. ఇక పరిస్తితులని బట్టి ప్రేమ్ సాగర్ రావు జంప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ ఆయన జంప్ అయితే..మంచిర్యాలలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే…ఒకవేళ ఆయన మరకపోతే బిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఉంటుంది. మొత్తానికి ప్రేమ్ సాగర్ రావు బట్టే మంచిర్యాల లెక్కలు మారతాయి.