రాజకీయాల్లో నాయకులకు-ప్రజలకు మధ్య సున్నితమైన సంబంధం ఉంటుంది. గతంలో అయితే.. తమ కు ఎలాంటి సమస్య ఉన్నా.. నేరుగా ప్రజాప్రతినిధిని కలిసేందుకు ప్రజలు వారి ఇళ్లముందు క్యూ కట్టుకునే వారు. దీంతో నేతలు డైరెక్టుగా ప్రజల మధ్యకు వెళ్లకపోయినా.. ప్రజలే వారి దగ్గరకు వచ్చేవారు కాబట్టి.. సంబంధాలు కొనసాగేవి. కానీ, నేడు అలాంటి పరిస్తితి ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థ, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలతో.. ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు మధ్య రిలేషన్ చాలా వరకు తగ్గిపోయింది. ఎలాంటి సమస్య వచ్చినా.. ప్రజలు వలంటీర్ల వద్దకే వెళ్తున్నారు.
ఒకింత బాధ అనిపించినా.. ఇది నిజమేనని టీడీపీ సీనియర్లు కూడా చెబుతున్నారు. ఆమె రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడి కుమార్తెగా ఆమె గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. కానీ, వచ్చే ఎన్నికల్లోనూ అదే కార్డు వినియోగిస్తారా? లేక.. తనకంటూ.. ప్రత్యేకంగా ఇమేజ్ ఏమైనా పెంచుకుంటారా? అంటే .. సమాధానం లభించడం లేదు. దీనికి కారణం.. ఆమె ప్రజల మధ్య ఉండడం లేదు. ఏదో అడపా దడపా.. కార్యక్రమాలకు హాజరు కావడం.. తర్వాత ఇంటికే పరిమితం కావడం ఇక్కడి టీడీపీ నేతలకే విసుగు తెప్పిస్తోందని అంటున్నారు.
ఇక, అసెంబ్లీ సమావేశాలకు మాత్రం తు.చ. తప్పకుండా హాజరు కావడం గమనార్హం. కేవలం అసెంబ్లీ కి హాజరైతేనే సరిపోతుందా? స‌్థానిక సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయరా? అనేది నియోజకవర్గం ప్రజల డిమాండ్. ఇదే విషయాన్ని స్థానిక నాయకులు కూడా చర్చిస్తున్నారు. అంతా.. ఆదిరెడ్డి అప్పారావే చూసుకుంటున్నారు. ఏదైనా ఉంటే.. ఆయనకే చెప్పమంటున్నారు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తారని.. సోషల్ మీడియాలోనూ ప్రశ్నలు కురుస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే.. ప్రజలు ఎలాంటి వారినైనా ఇంటికి పంపించిన చరిత్ర ఉందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ తరఫున గెలిచిన మహిళా ఎమ్మెల్యే ఇప్పటికైనా మార్పుచూపించాలనేది వీరి డిమాండ్.