ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు దివంగత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే, ఇటీవల పార్టీకి మహిళా నేత ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. దాంతో ఆదిలోనే హంసపాదులాగా వైఎస్‌ఆర్‌టీపీకి షాక్ తగిలినంత పని అయింది. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు షర్మిల పార్టీలో కొంత ఉత్సాహం తగ్గింది. శ్రేణులు కూడా నిరుత్సాహపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, ప్రజెంట్ వైఎస్ఆర్‌టీపీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపే వార్త ఒకటి తెలుస్తోంది.
అదేంటంటే.. షర్మిల పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ యాక్షన్ ప్లాన్ షురూ చేశారని సమాచారం.ఆయన సూచనలు, సలహాలతో పార్టీలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలకు కాన్ఫిడెన్స్ పెరిగే చాన్సెస్ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ అనుచర గణం త్వరలో లోటస్ పాండ్‌కు రాబోతున్నట్లు లోటస్ పాండ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇకపోతే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో తెలంగాణలో తాము పొలిటికల్ ఫోర్స్‌గా ఎదుగుతామనే ఆశాభావాన్ని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల లోటస్ పాండ్‌లో మీటి ద్ ప్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్ర షర్మిల మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తుల సూచనలు, సలహాలు తీసుకుంటే తప్పేంటిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యూహాల్లో ‘పీకే’ టీం ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది షర్మిల అనే చర్చ నడుస్తున్నది. ఈ మేరకు పీకే టీంతో ముందుగానే ఒప్పందం కుదిరి ఉండొచ్చనే అభిప్రాయం లోటస్ పాండ్ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నది.సెప్టెంబర్ 1 నుంచి వైఎస్ఆర్‌టీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్‌పైన దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.