పుత్రరత్నాల బాగోతం… పుడమిపైనే పున్నామ నరకం!

-

సెంచరీ కొడితేనే సచిన్ అవుతాడు… వందకోట్లు నొక్కేస్తేనే పొలిటీషియన్ అవుతాడు అని ఒక తెలుసు సినిమాలో డైలాగ్! మరి అలాంటి మాటలను ఆదర్శంగా తీసుకున్నారో లేక.. తండ్రుల వల్ల కావడంలేదని వారే స్వయంగా రంగంలోకి దిగారో.. అదీగాక తండ్రికి తోడుగా వారు ఒక చేయివేయాలని.. తద్వారా చన్నీళ్లకు వేడినీళ్లు సాయంగా ఉండాలనిని భావించారో తెలియదు కానీ… పరిస్థితులను గమనిస్తుంటే… గత ప్రభుత్వ హయాంలో పుత్రరత్నాల ప్రమేయం చాలా కీలకంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అది తండ్రుల అసమర్ధత అనుకోవాలో లేక పుత్రప్రేమ అనుకోవాలో అదీగాక “ట్రైనింగ్” లో భాగం అనుకోవాలో తెలియని పరిస్థితి!

పెద్ద తలకాయ నుంచి మొదలుపెడితే… నేడు టీడీపీ నుంచి బయటకు వస్తున్న సీనియర్లు కానీ, నిన్న బయటకు వచ్చి నేడు మంత్రులైన అవంతిలాంటి నేతలు కానీ చేసేది ఒకటే విమర్శ! చినబాబు లోకేష్ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందిని. మొన్న అవంతిశ్రీనివాస్, నిన్న కరణం బలరాం అనంతరం శిద్ధా రాఘవరావు… ఇలా ఎవరి నోటి నుంచి విమర్శ వచ్చినా… చంద్రబాబు కంటే అధికంగా చినబాబుపైకే వస్తున్నాయి! అంటే… చినబాబు నిర్వాకం నాడు ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

మొన్నటి ఫైబర్ గ్రిడ్ వ్యవహారం అయినా.. సంక్రాంతి కానుకల సంగతైనా.. తాజాగా వచ్చిన ఈఎస్ఐ స్కాం అయినా… ప్రతీ అంశంలోనూ ఎంతోకొంత లోకేష్ బాబు పేరు వినిపిస్తూనే ఉంది! వైకాపా నేతలు కూడా… అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు తులమో ఫలమో ఇచ్చి మిగిలిందంతా లోకేష్ నొక్కేశాడనే.. వారు అప్రూవర్స్ గా మారితే సేవ్ అవుతారనే కామెంట్లు నేరుగా పడిపోతున్నాయంటే… వాటిని పూర్తిగా రాజకీయ విమర్శలుగా చూడలేని పరిస్థితి.

ఈ క్రమంలో మరికొందరు పుత్రరత్నాలపై కూడా గతంలో ఇలాంటి విమర్శలే వచ్చాయి! మాజీ స్పీకర్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ పరిస్థితికి కూడా నూటికి నూరుశాతం ఆయన పుత్రరత్నం వ్యవహారశైలే కారణం అని, తండ్రిని తోలుబొమ్మను చేసి ఆడించాడని, తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని చేయని అరాచకం లేదని అప్పట్లో జిల్లా వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి!! ఇదే క్రమంలో రాయలసీమకూ చెందిన ఒక మహిళామంత్రి పుత్రరత్నం పేరు కూడా “అన్నీ తానై నడిపిస్తున్నాడు” అంటూ కథనాలు వచ్చాయి! తల్లికి చేదోడుగా ఉన్నాను అని ఆయన చెప్పినా… విమర్శలు ఆగలేదు!!

ఇదే క్రమంలో తాజాగా ప్రతీపాటి పుల్లారావు పుత్రరత్నం గురించి, పితాని సత్యనారాయణ పుత్రరత్నం గురించి విమర్శలు మొదలైపోయాయి. నిప్పులేకుండా పొగరాదు అనేది పాతమాటే అయినా… ఎందరికో పుత్రులున్నా కొందరి పుత్రుల పేర్లే బయటకు వస్తున్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు! ఇదే క్రమంలో నాడు సచివాలయాల్లోనూ, తెరవెనుక కార్యక్రమాల్లోనూ వీరే కీలకంగా వ్య్వహరించారని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ అవినీతి ఆరోపణలు పెద్దగా రాని కొందరు మాజీ మంత్రుల పిల్లలు ఇంకా చిన్నపిల్లలుగా ఉండటం వారికి కలిసొచ్చిన అంశం అనుకోవాల్సిన పరిస్థితి.. లేదంటే..!! ఏది ఏమైనా… పున్నామ నరకం నుంచి తప్పించడం సంగతేమో కానీ… ముందు ఈ ఏసీబీ, సీబీఐ కేసుల్లో ఇరికించకుండా ఉంటే చాలని పలువురు మాజీ మంత్రులైన తండ్రులు ఆలోచిస్తున్నారట!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version