ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీలో అధికార పార్టీ టీడీపీకి భారీగానే షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలంలా వైకాపాలో చేరేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ఆ పార్టీ అగ్ర నాయకులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తాజాగా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు వైకాపాలో చేరుతారని జోరుగా ప్రచారం కొనసాగుతుండగా, అదే బాటలో మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు కూడా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. గజపతి రాజు కూడా త్వరలో వైకాపాలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌తో పొత్తు ఇష్టం లేకే..?
1983లో ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు గజపతి రాజు ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉంటూ అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే పార్టీ పరంగా కూడా ముఖ్య నేతగా ఉన్నారు. ముక్కసూటి తనం, నిజాయితీ ఆయన ఆభరణాలని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు సీఎం చంద్రబాబుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే.. గజపతి రాజు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక వ్యక్తిగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. కానీ మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పనిచేశారు. అలాగే ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలతోపాటు, ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో తనకు పడదు కనుక, టీడీపీ – కాంగ్రెస్ పొత్తులో తాను ఇమడలేనని భావించిన గజపతి రాజు టీడీపీని వీడేందుకే నిర్ణయించుకున్నారని తెలిసింది.
టీడీపీని వీడితే ఆ పార్టీకి గట్టి షాకే..!
ఇక ఈ మధ్య కాలంలో టీడీపీలో జరుగుతున్న అనేక పరిణామాలు కూడా అశోక్ గజపతి రాజుకు నచ్చడం లేదట. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. అలాగే ఈ మధ్యే విజయనగరం జిల్లాలో జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనలోనూ అశోక్ గజపతి రాజు కనిపించలేదు. తన సొంత జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు కూడా అశోక్ గజపతి రాజు హాజరు కాలేదు. దీంతోపాటు టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్‌కు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే అశోక్ గజపతి రాజు త్వరలో టీడీపీకి షాక్ ఇవ్వనున్నారని తెలిసింది. టీడీపీకి రాజీనామా చేసి అశోక్ గజపతి రాజు వైకాపాలో చేరనున్నారని, జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా తెలిసింది. అదే నిజమైతే అశోక్ గజపతి రాజు సొంత నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది..!