మహానాడులో మాస్… బాబు ముందే సీనియర్స్ ఫైట్!

-

నేతలు పైకి చెప్పలేకపోయినా.. అధినేత బహిరంగంగా చెప్పుకోలేకపోయినా టీడీపీ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందనే అనుకోవాలి! ఎలాంటి టీడీపీకి ఎలాంటి కష్టాలు వచ్చాయిరా దేవుడా అని సదరు కార్యకర్తలు బాదపడుతున్న ఈ దశలో.. బాబు ఒంటెద్దు పోకడలు, లోకేష్ అపరిపక్వ నిర్ణయాలు పార్టీని నేడు ఈ పరిస్థితుల్లో నిలిపాయని తమ్ముళ్లు ఫీలవుతున్న దశ ఇది! ఈ సందర్భంగా జరిగిన మహానాడులో తెలుగు తమ్ముళ్ల విబేధాలు బయటపడటం.. బాబుకు మరో షాక్ అనే చెప్పాలి!

జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు వేదికపై లేరు.. పెద్దలను ప్రశ్నించే అసలు సిసలు కార్యకర్తలు ఎదురుగా లేరు.. ఈ పరిస్తితుల్లో ప్రశాంతంగా కూర్చున్న బాబుకు సీనియర్ నేతలు నిమ్మకాయల చినరాజప్ప – జ్యోతుల నెహ్రూల రూపంలో మరో తలపోటు బాబుకు వచ్చిపడింది! అవును… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందే సీనియర్ నేతలు చినరాజప్ప – జ్యోతుల నెహ్రుల మధ్య పరోక్ష మాటల యుద్ధం సాగింది. అధికారం పోగానే కొంతమంది నేతలు పార్టీని వీడిపోయారని, వారిని తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదని.. ప్రభుత్వం అధికారంలో లేకుంటే పార్టీని పట్టించుకోరా అని పరోక్షంగా జ్యోతులను ఉద్దేశించినట్లుగా చినరాజప్ప మాట్లాడారు! ఇలాంటి నేతల తీరును చంద్రబాబు గమనించాలని కూడా సూచించారు.

ఈ సమయంలో వెంటనే మైకందుకున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ చినరాజప్ప వ్యాఖ్యలపై విబేధించారు. కేవలం చినరాజప్పను ఉద్దేశించి మాత్రమే అన్నారో లేక ఇంకెవరినైనా ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ… మైక్ పట్టుకొని మాట్లాడితే సరిపోదని.. పార్టీ కేడర్కు నమ్మకం కలిగించాలని చెప్పారు. అనంతరం మరో అడుగు ముందుకేసిన నెహ్రూ.. అధినేత చుట్టూ ప్రదక్షిణ చేస్తే నాయకత్వం కాదని.. చినరాజప్ప మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

దీంతో బాబు సమక్షంలోనే ఇలా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు మాటల యుద్దాలకు దిగడం మహానాడులో సంచలన విషయంగా మారింది! అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని తలలు పట్టుకుంటుంటే… మధ్యలో మళ్లీ ఈ రోకలి పోట్లు ఏమిటిరా బాబు అని బాబు తల పట్టుకున్నారట! ఏది ఏమైనా… తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతలు ఈ మహానాడులో మాస్ అట్రాక్షన్ అయ్యారనే చెప్పాలి!

Read more RELATED
Recommended to you

Latest news