వచ్చే ఎన్నికల్లో టిడిపికి గెలవడం అనేది చావో రేవో లాంటిది. ఒకవేళ గెలవకుండా మళ్ళీ అధికారానికి దూరమైతే..ఇంకా టిడిపి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. అందుకే పార్టీ గెలుపు కోసం ఈ వయసులో కూడా చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు. అటు లోకేష్ సైతం పాదయాత్రలో కష్టపడుతున్నారు. కానీ వీరిద్దరి కష్టాన్ని టిడిపి నేతలు వృధా చేస్తున్నారు.
కొందరు నేతలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చూస్తూ..పార్టీనే దెబ్బ తీస్తున్నారు. ఇలా చాలా సీట్లలో టిడిపి నేతలు రచ్చ లేపుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని సీట్లలో టిడిపి నేతలు రచ్చ లేపుతున్నారు. గోపాలాపురం, చింతలపూడి, పోలవరం, నిడదవోలు, కొవ్వూరు లాంటి సీట్లలో తమ్ముళ్ళు కుమ్ములాటకు దిగుతున్నారు. నిజానికి ఈ ఐదు సీట్లు టిడిపికి కంచుకోటలే. కానీ టిడిపి నేతల రాజకీయం. వల్ల ఈ ఐదు సీట్లలో గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది.
అయితే ఇప్పుడు ఆ సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ క్రమంలో టిడిపికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ తెలుగు తమ్ముళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఎవరికి వారు కుమ్ములాటలకు దిగుతున్నారు. గోపాలాపురంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజుకు పడటం లేదు. ఇటు కొవ్వూరులో మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు టిడిపిలో మరో వర్గం యాంటీగా ఉంది. ఇటు పోలవరంలో మాజీ ఎమ్మెల్యే మోడియం శ్రీనివాసరావుకు, ప్రస్తుత ఇంచార్జ్ బొరగం శ్రీనివాసరావుకు పడటం లేదు.
ఇక చింతలపూడిలోప్ అయిదారుగురు నేతలు సీటు కోసం పోటీపడుతున్నారు. నిడదవోలు సీటులో మాజీ ఎమ్మెల్యే శేషారావుని టిడిపిలో ఓ వర్గం వ్యతిరేకిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో ఒక నేతకు సీటు దక్కితే వైసీపీ కాదు..టిడిపి నేతలే ఓడించేలా ఉన్నారు.