కరోనా రాజకీయం: నిరాహారదీక్షలో టీడీపీ ఎమ్మెల్యే!

-

ఒకపక్క దేశం మొత్తం కరోనాను ఎలా జయించాలన్న అంశం మీదనే ఫోకస్ పెడుతూ.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షం అన్న విషయం కూడా మరిచి మరీ అధికారపక్షాలకు సలహాలు సూచనలూ చేస్తుంటే.. ఈ సమయంలో కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా పోరాడాలని భావిస్తూ ఆ దిశగా ముందుకుపోతుంటే… బాబు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లున్నారు! ఇందులో భాగంగా పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టిసారింఛినట్లున్నారు అనే విమర్శలకు మరింత బలాన్ని ఇచ్చే కార్యక్రమం ఒకటి తాజాగా జరిగింది! గడిచిన కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న చంద్రబాబుకు.. కరోనా రూపంలో మైకుల ముందుకు వచ్చే అవకాశం వచ్చినట్లయ్యిందనే కామెంట్ల నడుమ నిమ్మల రామానాయుడు నిరాహారదీక్షకు దిగేశారు.. విమర్శలకు మరింత తావిచ్చేశారు!


లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆర్థిక సాయం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 12 గంటల నిరాహారదీక్షకు దిగారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ దీక్ష చేసి తీరతానని ఒక టెంట్ వేసుకుని, పసుపు చొక్కా ధరించి, పక్కన నందమూరి తారకరామారావు విగ్రహం పెట్టుకుని, ఆ స్థలినంతా పసుపురంగుతో నింపేసి, మెడలో నల్లనివస్త్రం వేసుకుని కూర్చున్నారు రామానాయుడు! ప్రతి పేద కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సాయం అందించడంతోపాటు, 10 రకాల నిత్యావసరాలను ఉచితంగా ఇంటింటికి అందించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో… వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతుధర అందించాలని డిమాండ్ చేశారు.
ఈ దీక్షను స్థానికంగానే కానీ, మీడియాలో చూసినవారినుండి కానీ ఏస్థాయి స్పందన వచ్చింది అనే విషయం కాసేపు పక్కన పెడితే… ఈ పరిస్థితుల నడుమ కూడా ఈ రేంజ్ రాజకీయం ఏమిటనేది మాత్రం బలంగా వినిపిస్తున్న విమర్శ! ఇదే సమయంలో అధికారమా, ప్రతిపక్షమా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే… ఈ సమయంలో మనం ఏ విదంగా ప్రజలకు ఉపయోగపడ్డాము అనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలనేది మరో కామెంట్ గా వినిపిస్తున్న మాట! ఈ క్రమంలో సదరు అధినేతకు తెలియకుండా.. ఎమ్మెల్యే దీక్షకు దిగే అవకాశాలు స్థానిక పార్టీల్లో జరిగే వ్యవహారం కాదు కాబట్టి… చంద్రబాబు అయినా కనీసం.. ఈ సమయాల్లో ఇలాంటి రాజకీయ దీక్షలు అవసరమా అనే ఆలోచన చేయకపోవడం కూడా.. బాబు పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు!
కాగా… పంటలకు గిట్టుబాటు ధరలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సుమారు 10రోజుల క్రితమే వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో సమీక్షలు జరపడం, మొక్కజొన్న కొనుగోలు చేయ నిర్ణయించడం.. ఇదే సమయంలో పత్తిపంట కొనుగోలుపై ముఖ్యమంత్రితో చర్చించడం, మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూసేలా దిశానిర్దేశాలు చేసుకోవడం ఎప్పుడో జరిగిపోయాయి. ఇదే క్రమంలో రైతు చెంతకే వెళ్లి రబీ ధాన్యం కొనుగోలు చేయనున్నామని.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ), మార్క్‌ఫెడ్‌ ద్వారా ధాన్యం, ఇతర పంటలు కొనుగోలు చేస్తామని ప్రకటించారు కూడా! ఇదే క్రమంలో ఆక్వా రైతుల విషయంలో కూడా చేయబోయే పనుల గురించి మోపిదేవి వెంకట రమణ కూడా ఆక్వారైతులతో మాట్లాడి వారికి దైర్యం కల్గించిన సంగతి తెలిసిందే! ఇవన్నీ తెలిసి కూడా మనుగడ కాపాడుకునే కార్యక్రమంలో భాగంగానో.. లేక రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా ఏదో ఒకటి చేయాలనే రాజకీయాలోచనలో భాగంగానో ఇలాంటి “ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్ – బిఫోర్ డిన్నర్ దీక్షలు”.. పైగా ఇలాంటి సమయాల్లో చేయడం ఏమిటనేది పలువురి అభిప్రాయంగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news