టార్గెట్ టీడీపీ అంటున్న మహిళలు…!

-

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఇంకా చెప్పాలంటే… చావో రేవో అనే పరిస్థితి కూడా. ఈసారి ఓడితే మాత్రం… మరో అవకాశమే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే గెలుపు కోసం జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకుని… చెట్టాపట్టాలేసుకుని ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీలనైతే తిట్టారో… ఇప్పుడు అదే పార్టీలతో కలిసి నడుస్తున్నారు చంద్రబాబు. ఇక గతానికి భిన్నంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను కూడా ప్రకటించారు చంద్రబాబు. ఇదే ఇప్పుడు కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతోంది. ముఖ్యంగా పార్టీ అధినేతపైనే పరోక్షంగా విమర్శలు కూడా చేస్తున్నారు పలువురు నేతలు. ముఖ్యంగా పార్టీకి చెందిన ఎస్సీ మహిళా నేతలు అభ్యర్థుల ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి… నాలుగేళ్ల పాటు చంద్రబాబుపై విమర్శలు చేశారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే కారణంతో… ఆమెను వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక పార్టీ ఫిరాయింపు కింద ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. అయితే శ్రీదేవికి రాబోయే ఎన్నికల్లో తిరువూరు టికెట్ ఇస్తారని కొన్ని రోజులు… కాదు కాదు… తాడికొండ నుంచే అవకాశం కల్పిస్తారని కొన్ని రోజులు… ఇవేవి కాదు… బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి అంటూ కొన్ని సార్లు ప్రచారం జోరుగా జరిగింది. ఆయా సందర్భాల్లో శ్రీదేవి వ్యవహారం సైతం అలాగే కనిపించింది కూడా. తిరువూరు కాపు నేతలతో శ్రీదేవి భర్త పలుమార్లు భేటీ కూడా అయ్యారు.

ఇక రాజధాని అమరావతి పరిధిలో జరిగిన పలు సమావేశాల్లో పాల్గొన్న శ్రీదేవి… తనను మన్నించండి అంటూ రైతులను వేడుకున్నారు కూడా. అయితే ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో శ్రీదేవి పేరు లేదు. తిరువూరు నుంచి కొలికిపూడి, తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ పోటీ చేస్తున్నారు. ఇక బాపట్ల ఎంపీ నుంచి హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పేరు ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన శ్రీదేవి… రాజకీయాలు ఎలా ఉంటాయో… ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది…! అంటూ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఫోటో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక మరో మాజీ మంత్రి పీతల సుజాత సైతం తనకు టికెట్ రాకపోవడంపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడి నుంచి టికెట్ ఆశించిన సూజతను పక్కన పెట్టిన చంద్రబాబు… అక్కడ రోషన్ అనే కొత్త వ్యక్తికి కేటాయించారు. దీంతో పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేసిన పీతల సుజాత… ప్రస్తుత రాజకీయాలు… లాయల్టీ, కమిట్‌మెంట్, హానెస్ట్‌కు విలువ లేకుండా పోతున్నాయి…! అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు రంపచోడవరం నియోజకవర్గం టికెట్ ఆశించిన వంతల రాజేశ్వరికి టికెట్ రాలేదు. దీంతో ఆమె కూడా అభిమానుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు. దీంతో టీడీపీలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు గుర్తింపు లేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news