తెలంగాణ రాష్ట్రం ఈనెల 31 వరకు షట్‌డౌన్ ప్రకటించింది. బ్రిటిష్ కాలంనాటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897ను రంగంలోకి దించింది. దీంతో సబ్‌డివిజనల్ మెజీస్ట్రేట్, కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు అపరిమిత అధికారాలు సంక్రమిస్తాయి.
ఇడిఎ-1897 అత్యంత శక్తివంతమైన చట్టం. దీన్ని ఆసరాగా తీసుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అన్వయించి సాంక్రామిక వ్యాధి నిరోధ చట్టం (1897), విపత్తు నిర్వహణ చట్టం – జీఓ 45ని విడుదల చేసారు. ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో సౌలభ్యాలు, నిబంధనలు ఈ కిందివిధంగా ఉంటాయి.
- అత్యవసర సరుకుల రవాణా కోసం తప్ప అన్ని వాహన రాకపోకల నిషేధం. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేత.
- ఆర్టీసీ బస్సులు, సెట్విన్, హైదరాబాద్ మెట్రో, టాక్సీలు, ఆటో రిక్షాలతో సహాప్రైవేట్ రవాణా బంద్. అత్యవసర వైద్యసేవలకు మినహాయింపు. కేవలం అత్యవసర సరుకులు రవాణా చేసే ప్రైవేట్ వాహనాలు మినహా ఇతర వాహనాలు నిషేధం.
- హోం క్వారంటైన్లో ఉండాలని సూచించిన వారు ఆ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలింపు.
- పౌరులెవరూ అత్యవసరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమిగూడటం నిషేధం.
- ఫార్మాస్యూటికల్స్, పప్పు, రైస్ మిల్లులు, ఆహార సంబంధిత పరిశ్రమలు, డెయిరీ యూనిట్లు యథావిధిగా పనిచేయవచ్చు. ఇవి కాకుండా ఇతర వ్యాపార వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు, గోదాములన్నీ బంద్.
- ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వం అనుమతిచ్చిన దుకాణాలు, ఇతర సముదాయాల్లో సామాజిక దూరం( సోషల్ డిస్టన్స్) పాటించాలి. ప్రతి ఇద్దరి మధ్య నాలుగు అడుగుల దూరం ఉండేలా పాదాల గుర్తులను విధిగావేయాలి. అవసరం మేరకు సానిటైజటర్లను అందుబాటులో ఉంచాలి. పరిశుభ్రత పాటించాలి.
- ఈ ఉత్తర్వుల నుంచి బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ కంపెనీలు, టెలికాం, పోస్టల్, ఇంటర్నెట్ సేవలు, ఆహారం, మెడిసన్, ఇతర వైద్య పరికరాల ఆన్లైన్ డెలివరీ సేవలు, ఆహార పదార్థాలు, గ్రోసరీస్, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు ఇతర గృహావసర వస్తువులు, రెస్టారెంట్ల వద్ద టేక్ అవే, హోం డెలివరీలు, దవాఖానలు, మెడికల్ షాపులు, కళ్లజోళ్ల దుకాణాలు, మందుల తయారీ పరిశ్రమలు, వాటి రవాణా సదుపాయం, పెట్రోల్ పంపులు, ఎల్పీజీ గ్యాసు, చమురు ఏజెన్సీలు, వాటి గోదాములు, వాటికి సంబంధించిన రవాణా, అన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మినహాయింపు వర్తిస్తుంది.
- జిల్లా కలెక్టరేట్లు, డివిజనల్, మండల కార్యాలయాలు, పోలీసు, హెల్త్, మున్సిపల్/స్థానిక సంస్థ కార్యాలయాలు, అగ్నిమాపక, పన్నులు, ఎక్సైజ్, వాణిజ్య పన్ను, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్, విద్యుత్, నీటి సరఫరా, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ మార్కెటింగ్, పౌరసరఫరాలు, కాలుష్య నియంత్రణ మండలి, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్‌తోపాటు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. మిగిలిన ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం 20 శాతం సిబ్బంది విధుల్లో ఉండేలా రొటేషన్ పద్ధతి పాటించాలి.
- రాష్ట్రంలోని 59 లక్షల రేషన్‌కార్డు దారులకు ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున మొత్తం 3.58 లక్షల టన్నులకు అవసరమైన రూ.1103 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బియ్యం మినహా పప్పు, కూరగాయలు, ఇతర నిత్యవసరాల కోసం వినియోగించుకునేలా ఒక్కో కుటుంబానికి రూ.1500 చొప్పున ప్రభుత్వం రూ.1314 కోట్లు విడుదలచేసింది.
- లాక్డౌన్ సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు ప్రైవేటు సంస్థలు వారివారి ఉద్యోగులకు, సిబ్బందికి రోజువారీ కూలీ/జీతాలు పూర్తిగా చెల్లించాలి. ఈ నిబంధన ఉల్లంఘించినవారిపై ఎపిడమిక్స్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం కఠినచర్యలు.
- ప్రజలకు నిత్యావసర సరుకులను చేరవేయడంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు.
- అన్ని విద్యాసంస్థల కార్యకలాపాలు, పేపర్ వాల్యుయేషన్ మార్చి 31 వరకు రద్దు.
- లాక్డౌన్ సమయంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల మూసివేత కారణంగా వాటి పరిధిలోని గర్భిణులు, బాలింతలకు ఆహారానికి సంబంధించిన సరుకులను వారి ఇండ్లకే పంపుతారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రసవించనున్న గర్భిణుల వివరాలను స్థానిక అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ముందుగానే సేకరిస్తారు. డెలివరీ తేదీలవారీగా అవసరమైన వైద్యం అందిస్తారు.
- కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులపై అదనపు భారం తగ్గించేలా అత్యవసరంలేని ఇతర రోగులకు సంబంధించిన శస్త్రచికిత్సలను వాయిదా వేస్తారు..
- ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమిగూడకుండా అన్ని ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలి. గ్రామ, పంచాయతీస్థాయిలోనే ధాన్యంసేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసేలా ఐకేపీ గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలను ప్రారంభిస్తాం. ధాన్యం సేకరణకు కూడా ప్రత్యేకం టైం స్లాట్‌ను కేటాయిస్తూ, ముందుగానే రైతులకు కూపన్లు ఇస్తారు. వాటి ప్రకారం ధాన్యం సేకరిస్తారు.
- ప్రభుత్వ ఆదేశాలను పాటించేలా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, పోలీసు కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలు ఎపిడెమిక్స్ డిసీజెస్ యాక్టు 1897, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 ప్రకారం శిక్షార్హులు.
- ఈ మార్గదర్శకాలను అనుగుణంగా విధులు నిర్వర్తించే అధికారులు, శాఖలపై ఎలాంటి కోర్టు వ్యాజ్యాలు వేయడానికి వీలులేదు.