ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసేందుకు కార్మిక సంఘాలు సమాయాత్తం అవుతున్నాయి. అందుకు తగిన విధంగా కార్మిక సంఘాలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మెతో పాటు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చే అవకాశాలు కూడా కార్మిక సంఘాలు పరిశీలిస్తున్నాయి. ఈనెల 19న తెలంగాణ బంద్ ప్రకటిస్తే ఎలా ఉంటుందని పలు సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచన చేస్తున్నారు. అందుకు ఈరోజు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాలు సమావేశం అవుతున్నాయి.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న తీరు తెన్నులను, ప్రభుత్వం సమ్మెపై మోపుతున్న ఉక్కుపాదాన్ని ఎలా ? ఎదుర్కోవాలి, రాజకీయ మద్దతును ఇంకా ఎలా ? బలోపేతం చేసుకోవాలో, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల మద్దతు కోసం తీసుకోవాల్సిన చర్యలపై, భవిష్యత్‌లో ఉద్యమంలో తీసుకోవాల్సిన ఎత్తుగడలను ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనున్నారు.
అందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు పలువురిని కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యం చేసేందుకు ఆర్టీసీ యూనియన్లు సన్నద్దం అవుతున్నాయి. అయితే ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాలో అనే ఆలోచనలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సమావేశంలో చర్చించనున్నారు. ఓవైపు ఆర్టీసి సమ్మెను ఎలా ఎదుర్కోవాలో, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలోనని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు.
అదే టైంలో ఇటు కేసీఆర్ నుంచి తెలంగాణ ఆర్టీసీని ఎలా కాపాడుకోవాలో, కార్మికుల ప్రయోజనాలు ఎలా నెరవేరాలో, కార్మికులకు ఉద్యోగ భద్రతపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాలు సమావేశం అవుతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం, కార్మిక సంఘాల సమావేశాలతో ఈరోజు ఆర్టీసీ సమ్మె ఎటువైపు దారితీస్తుందో, తెలంగాణ బంద్‌కు ఈనెల 19న నిర్ణయం తీసుకుంటారో, తెలంగాణ బంద్ ప్రకటిస్తే బంద్‌లో సకల జనుల సమ్మెలాగా సబ్బండ వర్గాల మద్దతును కూడగట్టేందుకు ఏ విధంగా కార్మిక సంఘాలు సమాయత్తం అవుతాయో వేచి చూడాల్సిందే… ఒకవేళ తెలంగాణ బంద్ ప్రకటిస్తే తెలంగాణ పోరును తలిపించేలా వాతావరణం క్రియేట్ అయ్యింది.