టీడీపీలో వీళ్ల బ్యాగులు స‌ర్దేస్తున్నారే… ఒక్క దెబ్బ‌తోనే అడ్ర‌స్ లేదే…!

-

అవును! ఒక్క ఓట‌మితోనే నేత‌లు కుంగిపోయారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనేక చోట్ల వార‌సుల‌ను రంగంలోకి దింపారు చంద్ర‌బాబు. ముఖ్యంగా అనంత‌పురం, చిత్తూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ వంటి ప్ర‌ధాన, బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త‌ను ప్రోత్స‌హించారు. ఇలా పోటీ చేసిన వారు కూడా స్థానికంగా బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్న కుటుంబాల నుంచి వ‌చ్చిన వారే కావ‌డంతో వారి గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ప‌రిటాల శ్రీరాం వంటి వారిపై ఏకంగా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు పందేలు కూడా క‌ట్టారు. కానీ, అంద‌రూ ఓట‌మి బాట‌ప‌ట్టారు. వైసీపీ సునామీ కావొచ్చు.. జ‌గ‌న్ వ్యూహం కావొచ్చు.. ఎన్నిక‌ల్లో వైసీపీ గాలులు వీచ‌డంతో టీడీపీ ఓట‌మిపాలైంది.

tdp

రాజ‌కీయాల్లో ముఖ్యంగా.. ఎన్నికల వేళ గెలుపు ఓట‌ములు స‌హ‌జంగా జ‌రిగేదే. అయితే.. ఒక్క ఓట‌మితోనే నేతలు కుంగిపోవ‌డం అనేది చిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌.. వారిలో ఒక్క‌రు కూడా ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. శ్రీకాకుళంలో యువ నాయ‌కురాలు గౌతు శిరీష్‌.. ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఓట‌మి త‌ర్వాత‌.. ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. కూడా తెలియ‌డం లేదు.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోదిగిన వారసురాలు ఖ‌తూన్ ఓట‌మి వెంట‌నే అమెరికాకు తిరుగు ప‌య‌నం అయ్యారు. దీంతో ఆమెపై పెద్ద మ‌చ్చ ప‌డిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నే టాక్ వ‌చ్చేసింది. ఇక‌, క‌ర్నూలులో కేఈ శ్యాం ప‌రిస్థితి కూడా ఇంతే. ఎన్నిక‌ల‌కు ముందు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు త‌ర్వాత చ‌ప్ప‌బ‌డిపోయారు. నంద్యాల నుంచి పోటీ చేసిన బ్ర‌హ్మానంద‌రెడ్డి అడ్ర‌స్ గ‌ల్లంతైంది. ఇక‌, చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నుంచి పోటీ చేసిన బొజ్జ‌ల సుధీర్ ప‌రిస్థితి ఏంటో.. ఎలాగుందో కూడా తెలియ‌దు.

ఇదే జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన గాలి ముద్దు కృష్ణ‌ కుమారుడు.. భాను ప్ర‌కాశ్ ప‌రిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇక‌, అనంత‌పురం జిల్లాలో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప‌రిటాల రవి.. బ‌య‌ట‌కు రావ‌డ‌మే లేద‌ని.. కేడ‌ర్ నిరాశ వ్య‌క్తం చేస్తోంది. ఇదే జిల్లాలో జేసీ కుమారులు ప‌వ‌న్‌, అస్మిత్‌లు.. కేసులతో కుస్తీ ప‌డుతున్నారు. మొత్తంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క‌సారి ఓట‌మితోనే యువ నేత‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు. ప్ర‌జ‌ల్లోకి రావ‌డం లేదు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం కూడా లేదు. మ‌రి ప‌రిస్థితి ఇలానే ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలా పుంజుకుంటారు? అప్ప‌టిక‌ప్పుడు .. చేసే ప్ర‌య‌త్నాల వ‌ల్ల పుంజుకుంటారా? ప‌్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగిస్తారా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news