టీఆర్‌ఎస్‌పై రెబల్స్ తిరుగుబావుటా..!

-

టీఆర్‌ఎస్.. ఉద్యమ పార్టీ. ప్రత్యేక తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ హైకమాండ్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న చాలామందిని నాయకులను పట్టించుకోలేదనే విమర్శలు చాలానే వచ్చాయి. అయినప్పటికీ.. కొంతమందిని బుజ్జగించడం, మరికొందరికి ఏదో ఒక పదవి కట్టబెట్టి సంతృప్తి పరచడం లాంటివి చేసింది హైకమాండ్. కొంతమంది 2019లో టికెట్ ఇస్తారులే అనుకొని హైకమాండ్‌కు జైకొట్టారు.

అయితే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019 దాకా ఆగకుండా.. అసెంబ్లీని ముందుగానే రద్దు చేసింది. దీంతో తాజా ఎమ్మెల్యేలు కాస్త మాజీలు అయిపోయారు. ప్రభుత్వ రద్దయిపోయింది. ఎన్నికలు త్వరలోనే తెలంగాణకు రానుండటంతో తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమయింది. అసెంబ్లీని రద్దు చేసిన రోజు టీఆర్‌ఎస్‌కు చెందిన 105 మంది అభ్యర్థులను సీఎం ప్రకటించారు. అక్కడే టీఆర్‌ఎస్‌లో అసమ్మతి స్వరాలు పెరిగాయి. 105 టికెట్లలో ఇద్దరి తప్ప మిగితా అందరూ సిట్టింగ్ అభ్యర్థులే. పార్టీకి ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేస్తున్న చాలామందికి టికెట్లు దొరకలేదు. దీంతో అభ్యర్థులను మార్చాలంటూ అధిష్ఠానానికి విన్నపాలు వెళ్తున్నాయి. కొంతమంది రెబల్స్‌గా పోటీ చేస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మొత్తానికి టీఆర్‌ఎస్‌లో ధిక్కార స్వరాలు బాగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది.

టికెట్ ఇచ్చిన అభ్యర్థులను చాలామంది కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. వెంటనే అభ్యర్థులను మార్చకపోతే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఉప్పల్ టికెట్ కోసం మేయర్ బొంతు రామ్మోహన్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు కలిసి విజ్ఞప్తి చేశాడు. కానీ.. కేటీఆర్ నుంచి సరైన స్పందన లభించలేదు. దీంతో కార్పొరేటర్లంతా రంగంలోకి దిగారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా అసమ్మతి స్వరం వినిపిస్తోంది. టీడీపీ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే వివేకానందకు టికెట్ ఇవ్వడంపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఎప్పటి నుంచో విధేయుడిగా పనిచేస్తున్న హన్మంత్ రెడ్డిని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై కుత్బుల్లాపూర్ ప్రజల్లోనూ అసంతృప్తి కనిపిస్తుంది. పార్టీ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేసిన కొలన్‌కు టికెట్‌ ఇవ్వకపోవడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కుత్బుల్లాపూర్‌లో కొలనుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.

కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు టికెట్ ఇవ్వడాన్ని నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రాజేంద్రనగర్ అభ్యర్థిగా ప్రకాశ్ గౌడ్, జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి అభ్యర్థిగా అరెకపూడి గాంధీ.. ఇలా రాష్ట్రంలోని పలు చోట్ల టీఆర్‌ఎస్ నిలబెట్టబోతున్న అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకతలు వస్తున్న నేపథ్యంలో హైకమాండ్ టికెట్ల విషయంలో మరోసారి పునరాలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version