మాజీ మంత్రి ఈటలకు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని ఈటల భార్య, కుమారుడితో పాటు జమునా హేచరీస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్‌పై జస్టిస్ వినోద్ కుమార్ తన నివాసంలోనే విచారణ చేపట్టారు.

సర్వే చేసే ముందు అధికారులు తమకు నోటీసు ఇవ్వలేదని, అలానే తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి హైకోర్టుకు వాదనలు వినిపించారు. కలెక్టర్ నివేదికను కూడా తమకు ఇవ్వలేదని వివరించారు. అయితే ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరిపామని ప్రభుత్వ తరపున న్యాయవాది (ఏజీ) హైకోర్టుకు తెలపగా… ఏజీ సమాధానంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా అని మండిపడింది. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయిందని ప్రశ్నించింది. ఇక అధికారులే కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు ఏజీ తెలిపారు.

ఇరు వాదనలు విన్న హైకోర్టు ఈటల భూముల వ్యవహరంలో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తప్పుబట్టింది. అధికారులు సహజ న్యాయసూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించారని ఫైర్ అయింది.ఇక జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై ఎలాంటి బలవంతపు చర్యలకు పూనుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.