పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవపై చర్యలు ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీ. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవేంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
ఇటీవల పాల్వంచలో రామక్రిష్ణ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యను పంపించాలని వనమా రాఘవ కోరాడని.. అతన్ని వదిలిపెట్టవద్దని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాన వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలు టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. వనమా రాఘవేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈరోజు పోలీసులు తమ ముందు హాజరు కావాలని వనమా రాఘవేంద్ర ఇంటికి నోటీసులు అందించారు. అయితే ఇప్పటి వరకు వనమా రాఘవ ఆచూకీ లేదు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక టీంలుగా మారి గాలిస్తున్నారు.