ఆయన పార్టీలో చేరినప్పుడే.. బందరు, అవనిగడ్డ, నరసాపురం పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. చంద్రబాబు మాత్రం రాధాను పక్కనబెట్టారు. దీంతో వంగవీటి అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు.
దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా కొడుకు వంగవీటి రాధాకృష్ణ ఇటీవలే హైడ్రామా మధ్య టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. వంగవీటి రాధాకు పార్టీ ప్రకటించిన అసెంబ్లీ, ఎంపీ సీట్ల జాబితాలో ఎక్కడా చోటు దొరకలేదు.
ఆయన పార్టీలో చేరినప్పుడే.. బందరు, అవనిగడ్డ, నరసాపురం పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. చంద్రబాబు మాత్రం రాధాను పక్కనబెట్టారు. దీంతో వంగవీటి అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు.
అయితే… వంగవీటికి టికెట్ ఇవ్వకపోవడం వెనుక చంద్రబాబుకు వేరే వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటిని వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అదనపు బలంగా మార్చాలని చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నారట.
అంటే.. వంగవీటికి ఏ టికెట్ ఇవ్వకుండా… ఆయనతో ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారం చేయించాలనేది చంద్రబాబు ప్లాన్. గత ఎన్నికల్లో టీడీపీకి కాపు ఓట్లు పవన్ కల్యాణ్ వల్ల పడ్డాయి. పోయినసారి పవన్ కల్యాణ్ టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో కాపులంతా టీడీపీకి ఓట్లేశారు. కానీ.. ఈసారి పవన్ కల్యాణ్ సపరేట్ గా పార్టీ పెట్టడంతో కాపు ఓట్లను కాపాడుకోవడం కోసం చంద్రబాబు వేసిన ఎత్తుగడే వంగవీటి రాధా.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ కాగా ఈ ఎన్నికల్లో వంగవీటి రాధాను స్టార్ క్యాంపెయినర్ గా దించాలన్నదే చంద్రబాబు ప్లాన్. అందుకే రాధాను పోటీకి దించకుండా ప్రచారం చేయించి తర్వాత ఎమ్మెల్సీ అవకాశం కల్పించి… ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రిగా కూడా చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చంద్రబాబు ప్లాన్ ఇలా ఉంటే.. మరోవైపు రాధా మాత్రం లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోతే అది తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందేమోనని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి.. రాధా ఎన్నికల్లో పోటీ చేయకుండా స్టార్ క్యాంపెయినర్ అవుతారా? లేక వేరే నిర్ణయాలు తీసుకుంటారా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.