నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తరువాత నెల్లూరు జిల్లాలో మార్పులు కనిపిస్తున్నాయి.లోకేష్ యాత్ర నెల్లూరు జిల్లాలోకి ఆత్మకూరు నియోజకవర్గం ద్వారా ప్రవేశించిన విషయం తెలిసిందే. 2009లో ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి ఆర్ధిక మంత్రిగా రాష్ర్టానికి సేవలందించారు. ఆ సమయంలో ఇక్కడ ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడమే కాదు బలమైన కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన 2019లో వెంకటగిరి నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే జగన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి లోనైన ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.ఈ క్రమంలో ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో యువగళం బాధ్యతను ఆయనకు అప్పగించారు జిల్లా టీడీపీ నాయకులు.దీంతో ఆయన మళ్ళీ ఆత్మకూరు నుంచి 2024లో పోటీ చేస్తారనే సంకేతాలిచ్చారు.
ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు ఉంటుంది.నెల్లూరు నగరం నుంచి బరిలో ఉన్న మాజీమంత్రి పొంగూరు నారాయణ కూడా మంత్రిగిరిని ఆశిస్తున్నారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి ఒకే జిల్లా నుంచి కేబినెట్‌లో చోటు దక్కకపోవచ్చన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఆనం రామనారాయణరెడ్డిని మళ్ళీ వెంకటగిరికే మార్చే యోచనలో ఉంది.ఈ విషయమై ఆనం రామనారాయణరెడ్డితో పలుమార్లు టీడీపీ అధిష్టానం చర్చలు జరిపినట్లు సమాచారం.మళ్ళీ వెంకటగిరికే పొమ్మనడంతో ఆనం రామనారాయణరెడ్డి పునరాలోచనలో పడినట్లైంది.
వైసీపీని ఆనం వీడాక వెంకటగిరి నియోకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు.ఇన్‌చార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని గడపలను చుట్టేస్తున్నారు.సందర్భం వచ్చినప్పుడల్లా ఆనంపై విమర్శలు చేస్తున్నారు నేదురుమల్లి.రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలన్న సంకల్పంతో తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు రామ్‌కుమార్‌రెడ్డి.ఈ మేరకు సీఎం జగన్‌నుంచి హామీ కూడా తీసుకున్నట్లు సమాచారం.వెంకటగిరికి మళ్ళీ రామ్‌నారాయణరెడ్డి రానున్న నేపథ్యంలో ఆయన్ను అన్నివిధాలా ఎదుర్కొనేందుకు రామ్‌కుమార్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారు. ఖచ్చితంగా ఆనంపై గెలుస్తాననే ధీమా వ్యక్తిపరుస్తున్నారు నేదురుమల్లి.