విమర్శలందు విజయసాయి విమర్శలు వేరయా అన్నట్లు మారిపోతుంది రోజు రోజుకీ పరిస్థితి! ఎవ్వరూ ఊహించనివి, ఎవరి ఊహకూ రానివి ఎక్కడ వెతుకుతారో తెలియదు కానీ… కొత్త కొత్త ఆరోపణలు చేస్తుంటారు విజయసాయిరెడ్డి. ఇక ఆ విమర్శలు చంద్రబాబు, లోకేశ్ లపై అయితే చెప్పే పనే లేదు! ట్విట్టర్ వేదికగా ఆరోపణల మీద ఆరోపణలు చేసేస్తుంటారు. కాకపోతే… ఈయన చేసే ఆరోపణలు నిజమే అన్నట్లుగా ప్రత్యర్థులు ప్రవర్తిస్తుండటంతో… విజయసాయి ఆరోపణలకు క్రెడిబిలిటీ పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం… గతంలో చంద్రబాబు – లోకేష్ లపై విజయసాయి చేసిన ఆరోపణలకు సరైన సమాధానాలు రాకపోవడం ఒకటి కాగా.. తాజాగా కన్నా లక్ష్మీనారయణ సైతం హడావిడి చేసి సైలంట్ అయిపోవడం!
వివరాళ్లోకి వెళ్తే… టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అందుకు ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ హుదూద్ తుఫాన్ – ఎన్టీఆర్ ట్రస్టు! అవును… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో హుదూద్ తుఫాన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు హుదూద్ రిలీఫ్ ఫండ్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఎన్టీఆర్ ట్రస్టులోకి లాగారని చెబుతున్నారు విజయసాయి! మంచిదే కదా… ట్రస్టుకు అంత సొమ్ము వస్తే అనుకునేరు… కానీ తుఫాన్ బాధితుల కోసం అంటూ సేకరించిన ఆ సొమ్మును బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబు నొక్కేశారనేది విజయసాయి సంచలన ఆరోపణ!
ఈ సందర్భంగా విజయసాయి… టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు! “టీడీపీ కార్యకర్తలూ, నాయకులూ మీరంతా ఓ నిజాన్ని తెలుసుకోవాలి.. త్యాగాలు మీవి.. భోగాలు వారివి.. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన వారంతా కళ్లు తెరవాలి” అని విజయసాయి తనదైన శైలిలో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదేసమయంలో పెద్దాయనను కూడా తెరపైకి తెచ్చిన విజయసాయి… ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు.. అనంతరం మద్య నిషేధానికి వెన్నుపోటు పొడిచారు.. ఎన్టీఆర్ ట్రస్టును కూడా లాక్కున్నారు.. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు.. చివరకు తుఫాన్ బాధితుల మొత్తం కూడా నొక్కేశారు.. ఏ లోకంలో ఉన్నారో గానీ ఎన్టీఆర్ గారు.. మీ అల్లుడి అరాచకాల కొరడా తీయండి” అంటూ విజయసాయి విరుచుకుపడుతున్నారు!
మరి ఈ స్థాయిలో చేసిన విజయసాయి ఆరోపణలపై తమ్ముళ్లు కానీ… చంద్రబాబు – లోకేష్ లు కానీ స్పందిస్తారో లేదో… స్పందిస్తే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!