విజయసాయి వర్షన్ మారింది…బాబుని వదిలేసినట్లేనా!

ఈ మధ్య ఏంటో విజయసాయిరెడ్డి పెద్దగా ఏపీ రాజకీయాల్లో హైలైట్ కావడం లేదు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అని అంతా అనుకుంటారు. అంటే వైసీపీలో విజయసాయిది నెంబర్ 2 స్థానం అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తాయి. ఇక ఉత్తరాంధ్రలో అయితే ఈయనదే హవా. అక్కడ ఎలాంటి రాజకీయమైన ఈయనే నడిపిస్తారు. ఇక విజయసాయి….టి‌డి‌పి అధినేత చంద్రబాబు టార్గెట్‌గా ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పనిలేదు.

చంద్రబాబుకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేస్తారు. కానీ ఈ మధ్య ఏంటో విజయసాయి విమర్శల జోలికి పోవడం లేదు. పైగా ఇటీవల పవన్-వైసీపీ నేతల మధ్య ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. అయినా సరే విజయసాయి ఏ మాత్రం స్పందించలేదు. అసలు కొన్ని రోజులు ఏపీ రాజకీయాల్లోనే కనబడలేదు. కాకపోతే తన ట్విట్టర్ ఖాతాలో మాత్రం ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని హైలైట్ చేస్తూ వస్తున్నారు.

తాజాగా విజయసాయి మళ్ళీ యాక్టివ్ అయ్యి, విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. తన ఎంపీ నిధులతో పనులు చేస్తున్నారు. అలాగే ‘సాయన్న ప్రజాదర్బార్’ పేరిట ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించనున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చేయడం, అలాగే వలంటీర్లు సక్రమంగా పని చేయకపోయినా.. లబ్దిదారులు ఈ విషయాన్ని ప్రజా దర్బార్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సంక్షేమ పథకాల అందించే వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వాటిని అప్పటికప్పుడు పరిష్కరించేలా విజయసాయి కృషి చేయనున్నారు.

అంటే ఇక నుంచి విజయసాయి ప్రజల మధ్యలో ఉండనున్నారు. మరి రాజకీయంగా విజయసాయి విమర్శలకు దూరంగా ఉంటారా? లేదా? అనేది క్లారిటీ లేరు. ప్రస్తుతానికైతే చంద్రబాబుపై గానీ, పవన్ కల్యాణ్‌పై గానీ ఎలాంటి విమర్శలు చేయడం లేదు. మరి ఈ పరిస్తితి చూస్తుంటే విజయసాయి వర్షన్ మారినట్లే కనిపిస్తోంది.