రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌.. కెకె స్థానం ఎవ‌రికి.. ?

-

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక నేప‌థ్యంలో 12 రాజ్యస‌భ స్థానాలు ఖాళీ అయిన విష‌యం తెలిసిందే.రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్న సీనియ‌ర్లు ప్ర‌తోయ‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానాల‌కు ఎన్నిక నిర్వ‌హించే క్ర‌మంలో భార‌త ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక‌ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో తెలంగాణలో రాజకీయాలు మ‌ళ్ళీ వేడెక్కాయి.

rajya sabha

బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె కేశ‌వ‌రావు అలియాస్ కెకె ఇటీవలె కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. త‌న రాజ్య‌స‌భ స్థానానికి ఆయ‌న రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక జ‌రుగనుంది. అయితే తెలంగాణ‌లో ఏర్ప‌డిన ఆ ఒక్క స్థానమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కేకే స్థానంలో ఎవరికి ఆ సీటును కేటాయిస్తారు..? వీహెచ్ వంటి సీనియ‌ర్‌ల‌కు ఛాన్స్‌ ఇస్తారా..? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది…? అనే అంశాలపై చర్చ జోరుగా సాగుతోంది.

ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌మను సింఘ్వీని తెలంగాణ కోటాలో రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ ఆలోచిస్తున్న‌ట్లు ప్ర‌చారం జరుగుతోంది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలో అభిషేక్ సింఘ్వీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో కేకే స్థానం ఖాళీ కావ‌డంతో ఆ స్థానంలో అభిషేక్ సంఘ్వీని పోటీ చేయించాల‌ని చూస్తున్నారు.

కెకెను ప‌ట్టుప‌ట్టి మరీ కాంగ్రెస్‌లోకి లాగేసుకుంది కూడా అందుకేన‌నే వాద‌న ప్ర‌చారంలో ఉంది. లోక‌ల్‌గా రాజ్య‌స‌భ సీటు ఆశిస్తున్నారు సీనియ‌ర్ నేత వి హ‌నుమంత‌రావు. ఇప్ప‌టికే ఆయ‌న ఏఐసీసీ పెద్ద‌ల‌కు త‌న విజ్ఞ‌ప్తిని చెప్పుకున్నారు. సీనియ‌ర్‌గా ఉన్న ఆఖ‌రిసారి పెద్ద‌ల‌స‌భ‌కు పంపాల‌ని కోరుకుంటున్నారు. అయితే అధిష్టానం ఆయ‌న‌కు ఛాన్స్ ఇస్తుందా అంటే అనుమాన‌మే అంటున్నారు కాంగ్రెస్‌ వ‌ర్గాలు. షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ఎవ‌రిని అభ్య‌ర్ధిని ప్ర‌క‌టిస్తారా అని ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఇక‌ తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3 న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 27 గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 14న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని, ఎన్నికల పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ అని భారత ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికైన తర్వాత పది స్థానాలు ఖాళీ అయ్యాయి.

దీంతోపాటు సభ్యులు రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. 12 సీట్లలో.. అస్సాం, బీహార్, మహారాష్ట్ర నుంచి రెండు చొప్పున.. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఒడిశా నుంచి ఒకటి చొప్పున సీట్లు ఉన్నాయి.. ఈ స్థానాల‌కు వేర్వేరుగా సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించి అదే రోజున‌ ఫలితాలు ప్రకటిస్తారు. దీంతో మ‌రోసారి రాజ‌కీయ పార్టీల్లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news