జగన్ హామీ ఇచ్చినా.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు దక్కలేదు.. ఎందుకు?

-

మరో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని జగన్ హింట్ ఇచ్చారు కదా. అంటే రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు మంత్రి పదవి దక్కని వారికి ఇచ్చే అవకాశం ఉందేమో.. అని అనుకుంటున్నారు.

అవును.. మీరు చదివిన టైటిల్ నిజమే. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా.. ఆ ఇద్దరిని గెలిపిస్తే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. వాళ్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటానని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ.. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన 25 మందిలో వాళ్లిద్దరు లేరు. ఏం.. ఎందుకని. వాళ్లిద్దరిని ఏపీ సీఎం జగన్ పక్కన పెట్టడానికి గల కారణం ఏంటి?

ఇంతకీ వాళ్లిద్దరు ఎవరు? అనేగా మీ డౌట్. వాళ్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్.

ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వైఎస్సాఆర్‌కు వీరాభిమాని. స్వతహాగా వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న ఆళ్లకు వ్యవసాయ శాఖ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై 5 వేల కంటే ఎక్కువ మెజారిటీతో ఆయన గెలిచారు. ఎన్నికల ప్రచార సమయంలో మంగళగిరికి వచ్చిన జగన్.. ఆళ్లను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ.. బెర్త్‌లో ఆయనకు చోటు దక్కలేదు.

ఇక… మర్రి రాజశేఖర్.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సీనియర్ నేత. ఆయన వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 2014లో చిలకలూరిపేట నుంచి ఓడిపోయారు. దీంతో 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. కానీ.. ఎన్‌ఆర్‌ఐ రజనీకి చిలకలూరిపేట నుంచి టికెట్‌ను కేటాయించారు జగన్. రజనీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని ఇస్తా అని జగన్ హామీ ఇచ్చారు. కానీ.. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

కారణం ఏమై ఉంటుంది?

మంత్రి వర్గ విస్తరణపై ఏపీ సీఎం జగన్ చాలా కసరత్తు చేశారు. ఏదో ఊరికే అలా ఎవరికి పడితే వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. సామాజిక సమీకరణాలు, జిల్లాలు, ఇతరత్రా విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. పార్టీలోని సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతనే జగన్.. మంత్రులను కన్ఫమ్ చేశారు. అలా 25 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అందులో భాగంగానే ఆళ్ల, మర్రికి మంత్రి పదవులు దక్కకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే.. మరో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని జగన్ హింట్ ఇచ్చారు కదా. అంటే రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు మంత్రి పదవి దక్కని వారికి ఇచ్చే అవకాశం ఉందేమో.. అని అనుకుంటున్నారు. అంటే.. మర్రి, ఆళ్లకు రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి దక్కొచ్చేమో? మొదటి దఫా రాకున్నా.. రెండో దఫాలో మంత్రులం అయినా చాలు అని వాళ్లు అనుకుంటున్నారట. ఈ విషయాన్ని జగన్‌కు కూడా వాళ్లు చెప్పినట్లు సమాచారం. చూద్దాం.. మరి రెండో సారి అయినా వాళ్లను మంత్రి పదవి వరిస్తుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news