అమరావతి : మోదీ పాలనతో దర్యాప్తు సంస్థల ప్రతిష్ఠను దిగజార్చారని, న్యాయ వ్యవస్థను వంచించారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణంపై జేపీపీ వేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని బిజేపీ నేతలను డిమాండ్ చేశారు. ఆర్థిక నేరగాళ్లు పీఎంవో చుట్టూ తిరుగుతున్నప్పుడే మోదీ నిష్ఫాక్షికత ఏంటో తెలిసిందన్నారు. ఆర్థిక నేరాల కేసుల దర్యాప్తును ఏడాదిలోగా పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోనప్పుడే వారి నిజాయతీ ఏపాటిదో తేలిపోయిందన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో జరుగుతున్న పరిణామాలపై యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. సీబీఐపై వస్తున్న ఆరోపణలు నరేంద్ర మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మోదీ పాలనతో వ్యవస్థలు పతనమయ్యామని చెప్పడానికి సీబీఐ ఉదంతమే ఉదాహరణ అని అన్నారు.