విశాఖలో పట్టుపెంచుకునేందుకు వైసీపీ పెద్దలు వ్యుహాత్మకంగా పావులు కదుపుతున్నారు.. సమర్దవంతమైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.. ఇదే క్రమంలో జిల్లా అధ్యక్షులను, ఇన్చార్జులను మార్చేశారు.. ఇటీవల జగన్ తో జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని.. టార్గెట్ విశాఖ అన్నట్లుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది వైసీపీ అధిష్టానం..
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి మంచిపట్టుంది.. గత ఎన్నికల్లో ఎన్టీయే కూటమికే ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ.. విశాఖ వెస్ట్ లో మళ్లీ బలపడాలని చూస్తోంది.. పట్టు కోల్పోకుండా పావులు కదుపుతోంది.. విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అడారి ఆనంద్ సైలెంట్ అయ్యారు.. ఓటమి తర్వాత ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేరు.. పార్టీ కార్యక్రమాలను సైతం నిర్వహించడంలేదు..దీంతో ఆయన స్థానంలో మళ్ల విజయ్ ప్రసాద్ కు వైసీపీ అధిష్టానం ఇన్చార్జిబాధ్యతలు అప్పగించింది..
విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గణబాబును ఢీకొట్టేందుకు వైసీపీ అధిష్టానం మళ్ల విజయ్ ప్రసాద్ ను రంగంలోకి దింపింది.. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని బలోపేతం చేశారు. పశ్చిమ నుంచి ఓసారి గెలిచి.. మరోసారి ఓడిపోయారు.. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.. దీంతో ఆయనకు ఎడ్యుకేషన్ కార్పొరేషణ్ చైర్మన్ పదవి దక్కింది..
వైసీపీ అధికారంలో ఉన్నసమయంలోనే మళ్ల విజయ్ ప్రసాద్ పలు కేసుల్లో జైలుకు వెళ్లారు..దీంతో ఆయన్ని పార్టీదూరం పెట్టింది.. పార్టీ పట్టించుకోకపోయినా.. విజయ్ ప్రసాద్ మాత్రం జగన్ కు విదేయునిగా ఉంటూ వచ్చారు.. 2019లో దాడి రత్నాకర్ కు టిక్కెట్ ఇచ్చిన వైసీపీ..ఇక్కడ గెలవలేకపోయింది..అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆనంద్ కు అవకాశం ఇచ్చింది.. ఆయన కూడా నెగ్గలేదు.. దీంతో వెస్ట్ లో పట్టునిలుపుకునేందుకు మళ్ల విజయ్ ప్రసాద్ కు వైసీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది.. దీంతో ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన విజయ్ ప్రసాద్ యాక్టివ్ గా తిరుగుతున్నారు.. ఆయన రాకతో క్యాడర్ లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.. వైసీపీ తాజా వ్యుహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి..