తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ వాపోతున్నారట. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఆమె ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే కేసీఆర్ పిలుపుతో కారెక్కారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టంతో సమస్య ఏర్పడుతుందని ఆమెను అధికారికంగా చేర్చుకోకుండా బయటి నుంచే పార్టీకి అనుకూలంగా పనిచేయాలని కేసీఆర్ నిర్దేశించారట. ఆ మేరకు ఆమె కూడా అదే విధంగా నడుచుకున్నారు.అయితే కోరి వచ్చిన టీర్ ఎస్‌లో ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఇక తన అనుచరవర్గానికి కూడా ఎలాంటి నామినేటెడ్ పదవులు, పనుల అప్పగింతలు లేకపోవడంతో తెగ ఇబ్బందిపడిపోతున్నారు.
గోరు చుట్టూ రోకలి పోటులా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల నుంచే ఇద్దరు జడ్పీచైర్మన్లను ఎంపిక చేయడంతో నియోజకవర్గంలో ఆమె ప్రాబల్యం తగ్గిపోతోందని, ప్రొటోకాల్ కూడా అధికారులు పాటించడం లేదని టీఆర్ఎస్ అధిష్ఠానం వద్ద వాపోయినట్లు సమాచారం. వాస్తవానికి ఆమె పార్టీలో చేరిన తొలిరోజుల్లో ఆమెకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగింది. గిరిజన మహిళ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రివర్గంలో ఆమెకు చోటు ఖాయమన్న విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ అవేవీ నిజం కాదని…హరిప్రియ కలలన్నీ కల్లలయ్యాయని ఇప్పుడిప్పుడే ఆమె అనుచరవర్గానికి తెలిసి వస్తోంది.
కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీలపై గంపెడు ఆశయాలు పెట్టుకున్న ఆమెకు చివరికి చేటే జరిగిందని ఆమె అనుచరులు వాపోతున్నారు. ఆమె కూడా ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా ఆమె సన్నిహితులు మీడియా వర్గాలకు వెల్లడిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి మంత్రి సత్యవతి రాథోడ్‌కు వచ్చే పదవికి ఆమెకు ఇస్తే న్యాయం జరిగి ఉండేదని, అధిష్ఠానం సత్యవతికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇచ్చి ఆమెకు అధిక ప్రాధాన్యంతో అందలం ఎక్కించిందని, ఆమె సోదరి కూతురు ఆంగోతు బిందుకు మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పదవి అప్పగించడం, తనపై పోటీ చేసి ఓడిపోయిన కోరం కనకయ్యకు సైతం టీఆర్ ఎస్ అధిష్ఠానం జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చింది.
ఎటోచ్చి తనకే అన్యాయం జరిగిందన్న ఆవేదనతో హరిప్రియ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఆమె అధిష్ఠానానికి విన్నవించడంతో కేసీఆర్‌సానకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి మంత్రి వర్గ విస్తరణలో కానీ ఇతరత్రా ఏదైనా న్యాయం జరుగుతుందని ఆమె ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి హరిప్రియనాయక్‌కు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ న్యాయ చేస్తారో లేదో..?