- అభ్యర్ధుల ప్రకటనలో యువతకు తగ్గిన ప్రధాన్యం
- ముప్ఫయ్యేళ్ళలోపు వారు కేవలం ఆరు మందే
యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే సమాజంలో అవినీతి అంతమవుతుందన్నది అందరూ చెప్తున్నటువంటి మాట. దీనికి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టలు కట్టుబడి ఉన్నాయి. అడపా దడపా ఈ మేరకు ప్రకటను కూడా చేస్తుంటాయి. కానీ టికెట్ల కేటాయింపులో యువ అభ్యర్ధులకు మొండిచెయ్యే ఎదురవుతోంది. మాటకు కట్టుబడని రాజకీయ పార్టీలు సీనియర్‌లకే టికెట్లు కేటాయిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ రాఫ్ర్టంలోనూ యువతను అసలు పట్టించుకున్న పాపానపోలేదు రాజకీయ పార్టీలు.
బరిలో నిలిచిన అభ్యర్ధులను బట్టి చూస్తే రాజకీయ పార్టీలు యువమంత్రం పాటించలేదనేది తేలిపోయింది. కేవలం 6 మంది మాత్రమే 30 ఏళ్ళలోపు వారు వివిధ నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. రాకీయాలకు కొత్తే అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ సీనియర్‌లకు చమటలు పట్టిస్తున్నారు ఈ యువ నేతలు. ఉద్ధండులైన ప్రత్యర్థులను ఢీకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యేక శైలిలో ఓటర్లకు దగ్గరవుతూ సమీప ప్రత్యర్థులను ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్‌ఆర్‌ఐ ఝూన్సీరెడ్డి కోడలు యశస్వినిరెడ్డి 26 ఏళ్ల వయస్సులో బరిలో నిలిచి రాజకీయ ఉద్ధండులు, బిఆర్‌ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ధీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2018లో బిటెక్ పూర్తి చేసిన ఆమె ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజేందర్‌రెడ్డిపై పోటీ చేస్తున్నారు. 30 సంవత్సరాలున్న ఆమె డిగ్రీ పూర్తి చేసి తన తాత చిట్టెం నర్సిరెడ్డి, తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కచ్చితంగా విజయం సాధిస్తాచంగలనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాసరి ఉష బహుజన సమాజ్ వాది పార్టీ నుంచి ఎన్నికల సమరంలో సీనియర్ నేత దాసరి మనోహర్‌రెడ్డిపై తలపడుతున్నారు. 27 ఏళ్ల ఉష 2018లో ఖరగ్‌పూర్ ఐఐటీలో బిటెక్ పూర్తి చేశారు. దళిత మేధావి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో అడుగుపెట్టి బడుగు,బలహీన వర్గాల కోసం సేవ చేస్తామని ప్రచారంలో పేర్కొంటూ ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పోటీలో ఉన్నారు. 26 ఏళ్ల రోహిత్ ఎంబిబిఎస్‌పూర్తి చేసి తన తండ్రి మైనంపల్లి హనుమంతరావు బాటలో నడుస్తూ పేదలకు ప్రజాప్రతినిధిగా ఎన్నికై సేవలందిస్తానని ప్రజా సేవకు సిద్ధం కావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.
హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున వడితెల ప్రణవ్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై ఎన్నికల పోరులో కాలు దువ్వుతున్నారు. 30 సంవత్సరాల ప్రణవ్ బిటెక్ పూర్తి చేసి రాజకీయాల ద్వారా పేదలను అన్ని విధాలుగా అభివృద్ది చేయవచ్చనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు. తనను ఆదరించి ప్రజా సేవ చేసేందుకు ఆశీర్వదించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా సామాజిక మాధ్యమాల్లో కనిపించే కర్నె శిరీష యాదవ్ ( బర్రెలక్క ) బరిలో నిలిచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్‌రెడ్డికి సవాల్ విసురుతున్నారు.
25 సంవత్సరాల శిరీష పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో నాలుగు గేదెలను పోషిస్తూ, చదువుకుంటే డిగ్రీలు తప్ప ఉద్యోగాలు రావని, నేటి యువత సొంతంగా వ్యాపారాలు చేయాలని సోషల్ మీడియా ద్వారా యువ సమాజానికి సందేశాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో ఫోలోవర్‌లు పెరిగారు.తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్తూ ప్రచారంలో దూసుకుపోతోంది శిరీష.