కోమటిరెడ్డి ఉన్నప్పుడు నల్గొండ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది : కేసీఆర్

నల్గొండకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా ఇంకా నా దత్తతలోనే ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కంచెర్ల భూపాల్ రెడ్డి రూ.1400 కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు. పనికి మాళిన వాళ్లకు ఓటు వేస్తే మన బ్రతుకే ఆగమవుతుందని తెలిపారు కేసీఆర్. కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేస్తామంటున్నారు. ధరణీ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని పేర్కొన్నారు కేసీఆర్.

ఆర్టీసీ బిడ్డలు అభద్రతగా ఉండేవారు.. ఎప్పుడు ఉద్యోగం పోతుందేమోనని.. ఆర్టీసీ బిల్లు పాస్ చేశాం.. గవర్నర్ వల్ల బిల్లు పాస్ కాస్త ఆలస్యం అయింది. నల్లగొండకు ఐటీ టవర్ తీసుకొచ్చాం. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 20 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశాడని ప్రశ్నించారు కేసీఆర్. రైతుబంధు ఉండాలా వద్దా అంటూ.. కనగల్, తిప్పర్తి, నల్గొండ రూరల్ రైతులను అడిగారు. ఇక్కడ భూపాల్ రెడ్డి గెలిస్తేనే అవన్నీ వస్తాయని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు, 24 గంటల కరెంట్ కావాలంటే కారు రావాలన్నారు. కాంగ్రెస్ తో ప్రమాదం పొంచి ఉందన్నారు.