ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో మాత్రం ఆయన వెనక్కు తగ్గే పరిస్థితి కనపడటం లేదు. రాజకీయంగా ఉన్న ఇబ్బందులను ఎదుర్కొంటూనే జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా, వాహన మిత్ర వంటి కార్యక్రమాలను జగన్ విజయవంతంగా అమలు చేసారు. నవరత్నాల అమలు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అమ్మ ఒడి పథకం అమలు కోసం జగన్ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ధిక పరిస్థితి ఇబ్బంది పడుతున్నా సరే ఇచ్చిన మాట కోసం జగన్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులు, మంత్రితో సమావేశమైన జగన్ నిధుల సమీకరణ విషయంలో వాళ్లకు అనేక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అప్పులు కూడా చెయ్యాల్సి రావడంతో, ఆర్ధిక శాఖ నిపుణులతో సంప్రదించి తక్కువ వడ్డీకే రుణాలను సేకరించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.
ఇప్పటికే లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రభుత్వం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. విపక్షాలు ఆర్ధిక శాఖ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నా జగన్ మాత్రం అమ్మ ఒడి విషయంలో వెనక్కు తగ్గడం లేదు. నిధుల సమీకరణ ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసారని సమాచారం. అమ్మఒడితో పాటుగా రెండో విడత రైతు భరోసా చెల్లింపులకు గడువు దగ్గరకు రావడంతో ఆర్ధిక శాఖ కూడా కసరత్తులు ముమ్మరం చేసింది. ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.