పెందుర్తిలో ఫ్యాన్ గాలి…. వైసీపీ అభ్య‌ర్ధికి సానుకూల ప‌వ‌నాలు

-

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పలువురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.మరో ఇద్దరు నేతలు కూడా వైసీపీ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరోసారి ఇక్కడ బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు.అటు జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి కొన‌సాగుతోంది.

1967 లో పెందుర్తి నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జి బుచ్చి అప్పారావు విజయం సాధించారు.పెందుర్తికి తొలి ఎమ్మెల్యేగా ఆయ‌న ప‌నిచేశారు.1972లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏఎస్ఆర్ ఉప్పలపాటి,1978లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి జి.అప్పన్న ,1980లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి డి సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా గెలిచారు.1983లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పి అప్పల నరసింహం, 1985లో టిడిపి అభ్య‌ర్థి రామచంద్రరావు ఇక్కడ విజయాన్ని సాధించారు.

1989లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి గురునాధరావు, 1994లో సిపిఐ నుంచి పోటీ చేసిన ఎం ఆంజనేయులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1999లో టిడిపి అభ్య‌ర్ధి గణబాబు 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి గురుమూర్తి రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచి చ‌ట్ట‌సభ‌ల్లో అడుగుపెట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్య‌ర్ధి రమేష్ బాబు,2014లో టిడిపి నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి ఇక్క‌డ విజ‌యం సాధించారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన అదీప్ రాజు అన్నపురెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి పై 28 860 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.

రాజ‌కీయంగా చైత‌న్యం క‌లిగిన పెందుర్తి నియోక‌వవ‌ర్గంలో ఓట‌ర్లు ఎప్పుడూ కొత్త‌వారిని ఆద‌రిస్తారు.అయితే ఈసారి ఇక్క‌డ వైసీపీకే అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని స‌ర్వేల్లో తేలింది.అందుకే వైసీప త‌ర‌పున మ‌ల్ళీ అదీప్‌రాజు బ‌రిలోకి దిగుతార‌ని స‌మాచారం. ఇక్క‌డ అభ్య‌ర్ధిని మార్చేందుకు సీఎం జ‌గ‌న్ కూడా ఆస‌క్తిగా లేర‌ని తెలుస్తోంది.మ‌రోవైపు టీడీపీ కూట‌మిఅభ్య‌ర్థి ఎవ‌రు అనేది ఇంత‌వ‌ర‌కు తేల‌లేదు.కొత్త అభ్య‌ర్ధిని బ‌రిలోకి దించేందుకు కూట‌మి నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గంలో 2,11,366 మంది ఓటర్లు ఉన్నారు.

ఇందులో పురుష ఓటర్లు 1,02,179 మంది,మహిళా ఓటర్లు 1,09,182 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరగగా, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ‌ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news