అమరావతి (విశాఖపట్నం): ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న తొమ్మిది మంది ఉపాధ్యాయులను విశాఖ జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వరరెడ్డి సస్పెండ్ చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే నెల రోజుల్లో కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్కు కృతజ్ఞతలు చెప్పేందుకు తొమ్మిది మంది ఉపాధ్యాయులు వెళ్లారు. అయితే వీరంతా పాదయాత్రలో పాల్గొని జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ కలిసి పనిచేస్తామని నినాదాలు చేసినట్టు పత్రికలలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన డీఈఓ…ఆ తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్ చేశారు. సస్పెండైన టీచర్లు పద్మనాభం, ఆనందపురం, భీమిలి, అనంతగిరి మండలాలకు చెందినవారని డీఈవో తెలిపారు.