అమరావతి: అరకు జంట హత్యల ఘటనపై సీఎం చంద్రబాబునాయుడుకు ప్రాథమిక నివేదిక అందింది. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలసిన డీజీపీ ఆర్ పి ఠాకూర్.. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టిడిపినేత సివేరి సోము హత్యకు సంబంధించిన రిపోర్టును అందజేశారు. ఆ నివేదికలో 6 గురు పేర్లు ఉన్నట్లు సమాచారం. వారంతా టీడీపీతోపాటు వైసీపీ, బహుజన్ సమాజ్ పార్టీ నేతలుగా పోలీసులు గుర్తించారు. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత నెలలో మావోయిస్టులు మూడు పర్యాయాలు వచ్చిన సమయంలో వారికి ఆశ్రయం ఇచ్చినట్లు విచారణలో తేలింది. వారిని మావోయిస్టులు బెదిరించి ఆశ్రయం పొందారా? లేక ఎటువంటి పరిస్థితుల్లో వారు ఆశ్రయం ఇచ్చారన్న అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే కిడారి, సోమలను మావోయిస్టులు హెచ్చరించి వదిలిపెడతారని అనుకున్నామని, కాల్చి చంపుతారని తాము భావించలేదని ఆరుగురు పోలీసులకు చెప్పినట్లు తెలియవచ్చింది. కిడారి హత్యకు ఆరుగురు స్థానిక నేతలు సహకరించగా… వీరిలో ముగ్గురికి టీడీపీ, ఇద్దరికి వైసీపీ, ఒకరికి బీఎస్పీతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు.
జంట హత్యలపై సీఎంకు నివేదిక
-