ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ బాధ్యతల కారణంగా చదువు మధ్యలో ఆపేసి పనులకు వెళ్తున్న వారికి శుభవార్త చెప్పింది. ఉదయం పనులు చేసుకుంటూ రాత్రిళ్లు చదువుకోవాలనుకునే వారికోసం నైట్ పాలిటెక్నిక్ కాలేజీలను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. పదోతరగతి, ఐటీఐలు చేసి చదువు మధ్యలో ఆపేసిన వారికోసం కొత్తగా 6 పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు, ఆదివారం పూర్తి స్థాయిలో తరగతులను నిర్వహించనున్నారు. గతంలో ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్ చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.ఇప్పుడు డిప్లొమా కోర్సులకు ఏపీ సాంకేతిక విద్యాశాఖ అనుమతించింది. ఈ కాలేజీలను విశాఖలో 3, చిత్తూరులో 2, రాజమహేంద్రవరంలో 1 చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
ఆయా కళాశాలల్లో 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వారు ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు వచ్చేవారు అర్హత ధ్రువపత్రాలు, చెల్లించాల్సిన ఫీజుతో రావాలి. ఇందులో రెండేళ్ల పాటు కంప్యూటర్, ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక రెండున్నరేళ్ల కోర్సుల్లో కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్(పెట్రోకెమికల్) ఉన్నాయి.