తెలంగాణ ప్రభుత్వం దర్శకుడు ఎన్. శంకర్‌కు స్టూడియో కోసం ఐదెకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని స్టూడియో కోసం ఎలా కేటాయిస్తారని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టుని ఆశ్రియంచడం.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించడం తెలిసిందే. ఇదే తరహాలో ఏపీలో ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళికి వైజాగ్‌లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తన చిన్న కుమారుడు ఫిల్మ్ స్టూడియో కట్టాలని అంటున్నాడని, ఇది తన ఆలోచనే అని పోసాని చెప్పేశారు. ఏపీలో ఎక్కడో ఒక దగ్గర స్టూడియో కోసం ప్రభుత్వాన్ని స్థలం అడగాలనుకుంటున్నాని, తను అడిగితే ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందని పోసాని చెబుతున్నారు. ఇటీవల వైజాగ్‌లోనూ టాలీవుడ్‌ని విస్తరించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం చిరుని ముందుకు రావాలని కోరింది. చిరు కూడా ఏపీలో స్టూడియో కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో రామానాయుడు స్టూడియోస్‌ని నిర్మించిన విషయం తెలిసిందే.