రాజకీయాల్లో కుదిరితే.. ఆదర్శంగా ఉండాలి. లేకపోతే.. కనీసం అందరివాడుగా అయినా ఉండాలి. గతంలో సీఎంగా చేసిన అనేక మంది ఈ రెండింటిలో ఏదో ఒక మార్గంలో పయనించి.. తమపేరు నిలబెట్టుకున్నారు. కానీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. దేశంలో తనకంటే పొలిటికల్ పండితుడు మరొకరు లేరని పదే పదే చెప్పే .. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ రెండు ఫార్ములాలకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు. తన అనుభవాన్ని ఆయన రాజకీయంగా తనకు, లేదా ఈ రాష్ట్రానికి కూడా ఉపయోగం కాకుండా చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తాజాగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రిగా జగన్ తిరుమలకు వెళ్తే.. చంద్రబాబు ఎలా వ్యవహరించాలి? ఏం చేయాలి? సంయమనం పాటించాలి. ఏదైనా ఉంటే.. అసెంబ్లీ వేదికగా.. ప్రభుత్వాన్ని, సీఎంను నిలదీయాల్సింది పోయి.. తన కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై రోడ్డెక్కి ధర్నాలుచేయడం, ఆందోళనలు చేయండి.. సీఎం కాన్వాయ్‌ను అడ్డగించండి.. అని పిలుపు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు గురి చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో హిందువులను రెచ్చగొట్టేలా కూడా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని ఎవరూ సహించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నామనే చెబుతోంది. ఆయా ఘటనలపై సీబీఐని వేయాలని కేంద్రాన్ని కూడా కోరింది. ఇంత జరుగుతుంటే.. తిరుమలకు వెళ్లిన సీఎం జగన్‌ను అడ్డుకోవాలని పిలుపివ్వడం ద్వారా బాబు నైతికంగా జారిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికే టీడీపీ తమ్ముళ్లు అనేక కేసుల్లో ఇరుక్కుని బెయిల్ కూడా లభించక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సీఎం కాన్వాయ్‌ను కూడా అడ్డుకుని జైలుకు వెళ్తే.. వారి కుటుంబాలకు బాబు భరోసా ఇస్తారా ? అనే ప్రశ్న కూడా తెరమీదికి వచ్చింది. మొత్తంగా ఇలా.. రగడ చేయాలని ప్రత్యక్షంగా చంద్రబాబు పిలుపునివ్వడం .. ఆయన సీనియార్టీకి మచ్చగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
-vuyyuru subhash