అనితకు మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదని, అనిత అన్నం తింటుందా? గడ్డి తింటుందా? అంటూ ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనిత పచ్చకామెర్లతో బాధ పడుతోందని, అందుకే ఎన్.సీ.ఆర్.బీ రిపోర్టుని కూడా పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు. హోంమంత్రి, మండలి వైస్ ఛైర్మన్ లాంటి ముఖ్యమైన పదవుల్లో సైతం మహిళలే ఉన్నారని, చంద్రబాబు చరిత్ర అంతా మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందేనన్నారు.
ఎన్టీఆర్ నుండి పార్టీ ని లాక్కునే దగ్గర్నుండి అనేక విషయాల్లో మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందేనని, ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? అని ఆమె ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. పవన్, చంద్రబాబు, లోకేష్ వాలంటీర్ల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో తోక ముడిచారు. మహిళల పుట్టుక గురించే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నా టీడీపీ నేతలు చూడలేకపోతన్నారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడిపిన వారికి చంద్రబాబు పదవులు ఇచ్చారు.
రిషితేశ్వరి ఘటనను కప్పి పుచ్చే ప్రయత్నం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. బీసీల తోక కట్ చేస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబు బీసీలకు ఇంకేం న్యాయం చేస్తారు? మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదు. మహిళల మిస్సింగులు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ. కానీ జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు’ అని పోతుల సునీత వ్యాఖ్యానించారు.