తెలంగాణలో సీఎం-గవర్నర్‌ల మధ్య అంతర్గత యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. బిజేపి వర్సెస్ బిఆర్‌ఎస్ అంటూ రాజకీయ యుద్ధం నడుస్తున్న తరుణంలో..కేసిఆర్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లు పోరు నడుస్తోంది. ఎప్పటినుంచో ఈ రచ్చ ఉంది. కేసిఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకటించడం లేదని గవర్నర్ తమిళిసై, గవర్నమెంట్‌కు సంబంధించిన కొన్ని బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం లేదని కేసిఆర్ ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నట్లు పోరు నడుస్తోంది. ఇదే సమయంలో రిపబ్లిక్ డే పై మరొకసారి చర్చ నడుస్తోంది. ఈ సారైనా రిపబ్లిక్ డే వేడుకలకు కేసిఆర్..రాజ్ భవన్ వస్తారా? లేదా? అనే చర్చ నడుస్తోంది. అయితే గత ఏడాది మాదిరి..కేసిఆర్ ప్రగతి భవన్ లో, గవర్నర్ రాజ్ భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే…త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అయితే బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సిన అవసరం ఉంది.
అందుకోసం కేసిఆర్..రాజ్ భవన్‌కు వెళ్తారా? లేక ఆర్ధిక మంత్రి హరీష్ రావు రాజ్ భవన్‌కు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. రాజకీయ పరమైన వైరుధ్యం నెలకొన్న నేపథ్యంలో ఇద్దరు రాజ్ భవన్‌కు వెళ్ళడం కష్టమని తెలుస్తోంది. వారి బదులు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుని గవర్నర్ వద్దకు పంపిస్తారని తెలుస్తోంది.
అదే సమయంలో గవర్నర్ బడ్జెట్ స్పీచ్‌పై కూడా ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది ఎలాగో గవర్నర్ స్పీచ్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు. మరి ఈ సారి అలాగే చేస్తారా..లేక బడ్జెట్ సమావేశాలని గవర్నర్ స్పీచ్‌తో మొదలుపెడతారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి రాజ్ భవన్, ప్రగతి భవన్‌ల మధ్య వార్ కొనసాగేలా ఉంది.