తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి రేవంత్ రెడ్డి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించడం షురూ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం చేసి, దివ్యాంగురాలు రజినీకి మొదటి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ప్రజా దర్బార్‌పై ఫోకస్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొట్టి.. ప్రజలను అనుమతిస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తున్నారు.
ఇవాళ హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా దర్బార్‌ను ప్రారంభించారు. ఈరోజు ఉదయం నగరంలోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఈరోజు నుంచి ప్రజా దర్బార్ ప్రారంభిస్తున్నట్లు రేవంత్ ప్రకటించడంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు.