ప్రకాశం: వైసీపీ నేతల్లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఇద్దరూ ప్రత్యర్థులు. ఇప్పుడు ఒకే గూటి పక్షులు. పైగా ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ. ఈ ఇద్దరు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తాజాగా మరింత ముదిరింది. ఇందుకు ఆనందయ్య మందు పంపిణీ కూడా ఒక వేదిక అయింది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మధ్య తాజాగా వర్గ విబేధాలు బయటపడ్డాయి. ఆనందయ్య మందు పంపిణీ జిల్లాలో గురువారం జరుగుతోంది. జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్‌లో ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ ఏర్పాట్లు చేశారు . దీంతో మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి కూడా తన ఇంటి వద్ద మందు పంపిణీ చేయాలని ఏర్పాట్లు చేశారు.
గతకాలంగా ఈ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందట. ఏ కార్యక్రమం జరిగినా రెండు వర్గాలుగా విడిపోయి విడివిడిగా నిర్వహిస్తున్నారట దీంతో పార్టీలోని మిగిలిన నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారట. ఎటు వెళ్తే ఏం జరుగుతోందనని మధ్యస్తంగా ఉంటున్నారట. ఈ పంచాయితీ ఇప్పటికే వైఎస్ జగన్ వద్దకు కూడా చేరిందని టాక్ వినిపిస్తోంది. మరి పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.