ప్రశాంత్ కిశోర్ రావడం వల్లే మోడీ గెలిచాడు. ప్రశాంత్ కిశోర్ వల్లే నితీశ్ గెలిచాడు. అదేవిధంగా పీకే వల్లే జగన్ గెలిచాడు.అవన్నీ గతం. కానీ ఇప్పుడు ఆయన వ్యూహాలు పనిచేస్తాయా? ఈ ప్రభుత్వం డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలని అనుకుంటుంది అని విపక్షం చేసిన లేదా చేస్తున్న ఆరోపణల ప్రభావం ఓటరుపై లేకుండా ఉంటుందా ? ఆలోచిస్తే అన్నీ ప్రశ్నలే!
గత ఎన్నికల్లో పీకే మంత్రం బాగానే పనిచేసింది. ప్రశాంత్ కిశోర్ టీం క్షేత్ర స్థాయిలో తిరుగాడిన విధంగా జగన్ చెంత ఉన్న వారెవ్వరూ పనిచేయలేకపోయారు కూడా! దీంతో 151 స్థానాలు గెలుచుకుని జగన్ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.ఇదే సమయంలో జగన్ ను ఢీ కొనే శక్తి చంద్రబాబుకు ఆ వేళ ఉన్నా కూడా, ఎందుకనో ఆయన చేసిన తప్పిదాల కారణంగానే ఓడిపోయారు. క్షేత్ర స్థాయిలో బాబుపై వ్యతిరేకత ఉన్నా కూడా మరీ 23 స్థానాలు గెలుచుకునే విధంగా అయితే లేదు. కానీ పీకే చెప్పిన నవరత్నాలు బాగానే పనిచేశాయి.ఆయన చెప్పిన విధంగా తీసుకువచ్చిన పథకాలు వాటి ప్రకటనలు అన్నీ కూడా ప్రజలపై చెదరని ముద్ర వేశాయి.దీంతో ప్రజలు కూడా జగన్ కు ఓ ఛాన్స్ ఇవ్వాలని భావించారు. అంతేకాదు అప్పటికి జగన్ ఎదుర్కొంటున్న అవమానాలు, ఇంకా ఇతర సందర్భాల్లో చవి చూసిన ఆశాభంగాలు ఇవన్నీ ప్రజల్లో సానుభూతి పెంచాయి.ఆ విధంగా జగన్ కు ఆ ఎన్నికలు ఎంతగానో కలిసి వచ్చాయి. పాదయాత్ర కారణంగా కూడా జగన్ మరింత జనాల్లోకి వెళ్లగలిగారు.
ఇక ఆరోజు పాదయాత్ర సందర్భంగా జగన్ ఎక్కడికక్కడ హామీలు ఇస్తూ వెళ్లారు. అవి సాధ్యమా కాదా అన్నది కూడా ఆలోచించలేదు. సీపీఎస్ రద్దు కు సంబంధించి ఆయన ప్రకటన చేసి తరువాత అధికారంలోకి రాగానే ఆ విషయమే మరిచిపోయారు.అంతేకాదు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పి ఆ విషయం కూడా మరిచిపోయారు. ఈ విధంగా ఆర్థిక సంబంధ విషయాలు అన్నింటినీ జగన్ అమలు చేయలేకపోయారు. ఈ తరుణంలో 2024 ఎన్నికల్లో జగన్ గెలవాలంటే మళ్లీ ప్రశాంత్ కిశోర్ వచ్చినా కూడా ఆ మార్కు రాజకీయం ఇప్పుడు ఫలితం ఇవ్వకపోవచ్చు.