తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దివంగత వైఎస్సార్ తనయురాలు….కొత్తగా పార్టీ పెట్టి దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ స్థాపించి, తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి ముందుకెళుతున్నారు. అయితే షర్మిల పార్టీ పెట్టగానే పెద్ద ఎత్తున నాయకులు, ఆ పార్టీలోకి వస్తారని అంతా భావించారు. పార్టీ పెట్టకముందు పలువురు నేతలు, షర్మిలకు మద్ధతుగా వచ్చారు.
కానీ ఊహించని విధంగా షర్మిలకు రేవంత్ రూపంలో పెద్ద షాక్ తగిలినట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చింది. పార్టీ నుంచి జంపింగులకు బ్రేక్ పడింది. అలాగే ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి వలసలు ఉంటాయని భావించిన షర్మిల పార్టీకి తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. పార్టీ పెట్టి రెండు వారాలు గడుస్తున్న కూడా ఇంతవరకు వేరే పార్టీ నాయకులు వైఎస్సార్టీపీలోకి రాలేదు.
భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్సార్టీపీలోకి వలసలు రావడం కష్టమని తెలుస్తోంది. అలాగే బీజేపీ, టీఆర్ఎస్‌ల నుంచి సైతం జంపింగులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఉంటే టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్యే జంపింగులు నడుస్తాయని చెప్పొచ్చు. ఏదేమైనా రేవంత్ ఎఫెక్ట్ షర్మిల పార్టీ మీద బాగానే పడింది.