క్రికెటర్ పృథ్వీ షాపై యూట్యూబర్ సప్నా గిల్ ఫిర్యాదు

-

సెల్ఫీ కోసం టీమ్‌ఇండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి ఘటనలో రోజుకో కీలక అంశం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో నిందితురాలిగా అరెస్టయిన యూట్యూబర్‌ సప్నా గిల్‌.. షాపై ఫిర్యాదు చేశారు. గతవారం ముంబయిలోని ఓ హోటల్‌ వద్ద పృథ్వీ షా సెల్ఫీకి నిరాకరించడంతో అతడిపై, అతడి స్నేహితులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అంతేగాక, తప్పుడు కేసు పెడతామంటూ నిందితులు డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సప్నా గిల్‌ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సప్నా గిల్‌ను కోర్టులో హాజరుపర్చగా.. ఆమెకు మూడు రోజుల కస్టడీ విధించారు.

ఆ కస్టడీ సోమవారం నాటికి ముగియడంతో కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. బయటకు వచ్చిన సప్నా.. నిన్న అంధేరీ పోలీసు స్టేషన్‌లో పృథ్వీ షా, అతడి స్నేహితులపై ఫిర్యాదు చేశారు. ‘‘నా ఫ్రెండ్‌తో కలిసి నేను హోటల్‌కు వెళ్లగా అక్కడ పృథ్వీ షా తన స్నేహితులతో కన్పించాడు. నా స్నేహితుడు ఓ టీనేజర్‌ క్రికెట్‌ అభిమాని కావడంతో సెల్ఫీ కోసం వాళ్ల వద్దకు వెళ్లాడు. అప్పటికే పృథ్వీ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో ఉన్నారు. వారు అతడిపై దాడి చేయడంతో నా స్నేహితుడిని కాపాడేందుకే నేను మధ్యలో వెళ్లాను. నా ఫ్రెండ్‌కు హానీ చేయొద్దని పృథ్వీషాను వేడుకున్నా. కానీ, వారు వినిపించుకోలేదు. పైగా నేను దాడి చేశానని అంటూ నాపై కేసు పెట్టారు’’ అని సప్నా గిల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news