హైదరాబాద్ విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే.. మెట్రో పనులకు ప్రధానంగా రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. అలైన్‌మెంట్ మార్కింగ్ పూర్తికావడంతో ఎక్కడెక్కడ ఆస్తుల సేకరణ అవసరమో నిర్ధారణకు వచ్చారు.
ప్రధానంగా మలుపులు ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్తులను సేకరించాల్సి వస్తోంది. ఖాజాగూడ, నానక్‌రాంగూడ, శంషాబాద్ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్‌లో మలుపులు ఉన్నాయి. అన్నిచోట్ల కలిపి కిలోమీటర్ మేర ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో 95 శాతం ఖాళీ స్థలాలే ఉన్నాయి. మరో 5 శాతం వరకు భవనాలు ఉన్నాయి.
మొత్తం 31 కి.మీ. మార్గంలో 30 కి.మీ. మేర ఆస్తుల సేకరణ సమస్యలు లేవని అధికారులు తెలిపారు. ఓఆర్‌ఆర్, ప్రభుత్వ భూముల్లోంచి అలైన్‌మెంట్ వెళ్తుందని వెల్లడించారు. ఒక కిలోమీటర్ మేర మాత్రం ప్రైవేటు ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. ఖాజాగూడలో మలుపు వద్ద కొన్ని ఆస్తులు.. ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి శంషాబాద్ పట్టణంలోకి వెళ్లేచోట జాతీయ రహదారి వరకు కొన్ని ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు.