తాను తెలుగు సినిమా షూటింగ్‌లు చేయట్లేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. విజయ్ హీరోగా తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నానని స్పష్టం చేశారు. చిత్రీకరణల విషయమై టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన వివరణ ఇచ్చారు. తెలుగు సినిమాల షూటింగ్స్ మాత్రమే బంద్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు చిత్రీకరణలు ఆపేద్దామన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల అభిప్రాయానికి చలన చిత్ర వాణిజ్య మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇతర భాషలకి చెందిన సినిమాల చిత్రీకరణలు యథావిధిగా కొనసాగించేందుకు అనుమతినివ్వడంతో విజయ్ ‘వారిసు’ , ధనుష్ ‘సార్’ తదితర తమిళ చిత్రాలు సోమవారం షూటింగ్స్ జరిగాయి. ఇవి తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందే సినిమాలు కావడంతో పలువురు నిర్మాతలు అసహనం వ్యక్తం చేశారు.
సమస్యల పరిష్కారం దిశగా బంద్‌కు పిలుపునిస్తే ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమే ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’ పేరుతో రాబోతుంది. రష్మిక కథానాయిక. ఈ సినిమా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.