లోక్‌సభలో పచ్చి వంకాయ కొరికిన ఎంపీ.. ఎందుకంటే..?

-

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, వాయిదా పర్వం తర్వాత లోక్‌సభలో నేడు చర్చ మొదలైంది. ధరల పెరుగుదలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దిగువ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ దస్తీదార్‌.. వంటగ్యాస్‌ ధర పెరుగుదల గురించి ప్రస్తావిస్తూ పచ్చి వంకాయ కొరికి చూపించారు. గ్యాస్‌బండ మోతెక్కడంతో సామాన్యులకు వండుకోవడం కష్టంగా మారిందన్న ఉద్దేశంతో ఆమె ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు.

‘‘ఇటీవల స్వల్ప వ్యవధిలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధరను నాలుగు సార్లు పెంచారు. ఒకప్పుడు రూ.600గా ఉన్న గ్యాస్‌ బండ ఇప్పుడు రూ.1100 దాటింది. సామాన్యులకు వంట చేసుకోవడం కూడా భారంగా మారింది. ప్రజలు పచ్చి కూరగాయాలు తినాలని ప్రభుత్వం కోరుకుంటోందా?’’ అని ఎంపీ కకోలీ ప్రశ్నిస్తూ.. తన టేబుల్‌పై ఉన్న పచ్చి వంకాయను తీసుకుని కొరికారు. ఈ చర్యతో సభ్యులంతా నవ్వులు చిందించారు. గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని తృణమూల్‌ ఎంపీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన రోజే విపక్షాలు ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్‌టీ వంటి అంశాలను లేవెనెత్తి ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సభా కార్యకలాపాలు స్తంభించి వాయిదాల పర్వం నడించింది. ఈ క్రమంలోనే నలుగురు కాంగ్రెస్‌ ఎంపీలు సస్పెండ్‌ అవడం మరింత గందరగోళానికి దారితీసింది. అయితే ఆ ఎంపీలపై నేడు సస్పెన్షన్‌ ఎత్తివేశారు. విపక్షాలు కూడా ఆందోళనలపై వెనక్కి తగ్గడంతో సోమవారం లోక్‌సభలో ధరల పెరుగుదలపై చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news