ఏపీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రీయ సేవా సమితి (రాస్) దేశ రాజధాని ఢిల్లీలో తన నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యాలయ భవన సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాస్ సేవలను కొనియాడారు. 40 ఏళ్లుగా రాస్ సేవలు అందిస్తోందన్న వెంకయ్య… మహిళా సాధికారత కోసం సంస్థ సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రముఖ గాంధేయవాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు మార్గనిర్దేశకత్వంలో రాస్ సేవలు వేగంగా విస్తరించాయని ఆయన తెలిపారు. ఢిల్లీలోనూ తమ సంస్థ సేవలు అందించాలని ఆయన ఎంతో తపించారన్న వెంకయ్య… ఈ రోజు మునిరత్నం నాయుడు లేకపోవడం విచారకరమని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్‌కు ఆయన నివాళుర్పించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఒక సామూహిక ఉద్యమంలా మారుతోందని, అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. మరోవైపు ఆటబొమ్మల ఎగుమతిలో ఇండియా పవర్‌హౌస్‌గా మారుతోందని వెల్లడించారు. బొమ్మల ఎగుమతి 2వేల 600 కోట్లకు పెరిగిందని మోడీ వివరించారు. ఆగస్ట్ 2న మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోసించారని మోడీ గుర్తు చేశారు.